Reading Time: 2 minutes

అసహనంలో ఇంజనీర్లు

సెలవులపై వేళ్ళేందుకు ప్రయత్నాలు

భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు..

కార్యరూపంలోకి వస్తోన్న ప్రాజెక్టులు

పెరిగిన జీహెచ్‌ఎంసి చ.కి.మీ.లు.. తగ్గిన అధికారులు

మనతెలంగాణ, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసిలో ఇంజనీర్లు పనిభారంతో అసహనానకి లోనవుతున్నారనీ, బదిలీపై ఇక్కడకు వచ్చేందుకు సీనియర్ ఇంజనీర్లు ఆసక్తిని చూపడంలేదనే ఆసక్తికరమన చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఇంజనీర్ల కొరతతో ఉన్నవారిపైనే తీవ్రమైన పనిభారం పెరుగుతుంది. ఫలితంగా పలువురు ఇంజనీర్లు సెలవులపై వెళ్ళేందుకు సిద్దమవుతున్నారనేది సమాచారం. ఓవైపు ప్రాజెక్టులు కార్యరూపంలోకి తీసుకురావాల్సిన పరిస్థితులు… మరోవైపు నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యతలు.. ఇంకోవైపు నెలనెలకు పదవీ విరమణ పొందుతున్న సీనియర్ ఇంజనీర్లు.. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంజనీర్లకు పనిభారం కాస్త తడిసి మోపెడవుతోంది. ఇది తెలిసి కూడా ఖాళీ పోస్టులను భర్తీచేసే దిశగా జీహెచ్‌ఎంసి ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు అధికారుల్లో వినిపిస్తున్నాయి. కనీసం 400 మంది ఇంజనీర్లు ఉండాల్సిన జీహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగంలో కేవలం 100 మంది వరకు మాత్రమే ఉన్నారనేది అధికార వర్గాల సమాచారం. ఈ ఎప్రిల్‌తో పాటు మే, జూన్ నెలలోనూ మొత్తం 14 మంది ఇంజనీర్లు పదవీ విరమణ చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ 14 మందికి బదులుగా మరో 14 మంది జీహెచ్‌ఎంసికి వస్తారా..? అంటే.. అదీ లేదు. ఇటీవల రిటైర్‌మెంట్ అయినవారి పోస్టుల్లో ఇతరులు వచ్చి చేరలేదు. దీంతో పదవీ విరమణ చేసిన వారి బాధ్యతలు కూడా ప్రస్తుతమున్న వారే చేపట్టాల్సి వస్తోందని ఆవేదిన చెందుతున్నారు.

426 ఇంజనీర్లు ఇవ్వండి…

జీహెచ్‌ఎంసిలో స్టాఫింగ్ పాట్రన్‌పై అధ్యయనంచేసి నివేదిక అందించిన ప్రసాదరావు కమిటీ నివేదిక మాత్రం.. ఇంజనీరింగ్ విభాగానికి అదనంగా కనీసం 426 పోస్టు(ప్రాజెక్ట్169, మేయింటనెన్స్257)లను రెండు దశల్లో మంజూరు చేయాలని స్పష్టంచేసింది. మొదటి దశలో ప్రాజెక్ట్‌కు 144, మేయింటనెన్స్‌కు 257. రెండో దశలో ప్రాజెక్ట్‌కు 25 పోస్టులను సాంక్షన్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈమేరకు తేది 03.04.2013లో జీఓ. ఎంస్ నెం. 92ను అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం వెలువరించింది. ఈ జీవో నెం. 92 ప్రకార ఇప్పటి వరకు ఏఈఈ పోస్టుల్లోకి119 మంది మాత్రమే జీహెచ్‌ఎంసికి వచ్చినా, నేటికి ఏఈఈ, డిఈఈ, ఈఈ, ఎస్‌ఈ పోస్టులు ఖాళీలతో అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నవి.

ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం మూడు కార్పోరేషన్‌లుగా జీహెచ్‌ఎంసి విభజించబడింది. దీంతో ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లు మూడు కార్పోరేషన్‌లకు వెళ్ళారు. ఒక్కొక్క కార్పోరేషన్‌లో ప్రాజెక్ట్, మేయింటనెన్స్‌లలో ఇంజనీర్ల కొరత తీవ్రత మరింత పెరిగింది. జీహెచ్‌ఎంసి మాత్రం 650 చ.కి.మీ.ల నుండి 689.76 చ.కి.మీ.లకు పెరిగి 6 జోన్‌లు, 30 సర్కిళ్ళు, 150 వార్డులుగా ఆవిర్భవించింది. దీంతో ఉన్న ఇంజనీర్లకు అదనపు భాధ్యతలు పెరిగాయి. ఈఈలు ఎస్‌ఈలుగా, ఎస్‌ఈలు సీఈలుగా అదనపు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అదనపు బాధ్యతలు ఇటు ఈఈగా.. అటు ఎస్‌ఈగా రెండేసి బాధ్యతలను నిర్వర్తించడమే కష్టమవుతోందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

భర్తీచేయడం అవసరం..

ప్రస్తుత అధికార వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ నెలలో ఎస్‌ఈలు4, ఈఈలు 3, మే నెలలో ఎస్‌ఈలు3 మంది ఇలా ప్రతినెల సీనియర్ ఇంజనీర్లు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసిలో సీనియర్ ఇంజనీర్ల కొరత తీవ్రంగామారి ప్రాజెక్టులు, నిర్వహణ పథకాలు తీవ్ర జాప్యానికి కారణమవుతుందనేది అధికార వర్గాల్లోని అభిప్రాయం. ప్రాజెక్ట్‌లో నాలుగు జోన్‌లకు ఎస్‌ఈలు4, ఈఈ 4 డీఈఈ8, ఏఈఈ 8, ఫీల్డ్ లేవల్ స్టాఫ్‌గా డీఈఈలు, ఏఈఈలు, మేయింటనెన్స్‌లో జోన్‌కు ఒక ఎస్‌ఈ, సర్కిల్‌కు ఒక ఈఈ, సర్కిల్‌కు ఇద్దరు డీఈఈలు , ఏఈఈలు 120. క్వాలిటీ కంట్రోల్ సెల్‌లో ఎస్‌ఈ, ఈఈ, డీఈఈలు, డిజైన్ వింగ్‌లో, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లోనూ ఇంజనీర్ల పోస్టులను భర్తీచేయాల్సిన అవసరం ఉన్నది. కానీ, ఉన్నవారిపై పనిభారం మోపుతోన్న జీహెచ్‌ఎంసి అధికారులు ప్రభుత్వం నుండి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు చేయడంలేదని, తద్వారా తాము పనిచేయడంకన్నా.. సెలవుపై వెళ్ళడమే ఉత్తమమని భావిస్తున్నారు. ప్రాజెక్టులు, మేయింటనెన్స్ విధులు కార్యాలయాల్లో కూర్చుని చేసే పనులు కాదని సాంకేతికంగా పరిశీలించడం, క్షేత్రస్థాయిలో వెళ్ళి తనిఖీలు చేయడం, పర్యవేక్షణ చేపట్టడం వంటి విధులుంటాయని, దానిని గుర్తించి సరిపడా స్టాఫ్‌ను తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యతను విస్మరించడంతో ఇంజనీర్లలో అసహనం వ్యక్తమవుతోంది.