Reading Time: < 1 minute

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ బిజీ అయ్యారు. ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు శాంతి చర్చలకు ముందు శనివారంనాడు ఆయనతో వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ భేటీల్లో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కూడా ఉన్నారు. ఇరాన్ స్పీకర్ మహ్మద్ బఘేరి, విదేశాంగ మంత్రి అరాగ్చీ తదితరులు పాక్ ప్రధానితో సమావేశమైన చర్చలకు సంబంధించి షరతులను ఆయన ముందుంచారు. అమెరికా స్తంభింపచేసిన విదేశాల్లోని తమ ఆస్తులను విడుదల చేయడం, లెబనాన్‌పై తక్షణమే దాడులు ఆపాలని, అప్పుడే చర్చలు ముందుకు వెళ్తాయని చెప్పినట్లు సమాచారం.

అంతకుముందు జెడి వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందంతో కూడా షరీఫ్ సమావేశమయ్యారు. వాన్స్‌తో పాటు ఈ సమావేశంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ ఉన్నారు. ఇరు పక్షాలతో చర్చలు ప్రశాంతంగా సాగాలని, ఫలితం దిశగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు షరీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఈ చర్చలతో శాశ్వత శాంతి నెలకొనాలని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారని పాక్ అధికారిక టివి వెల్లడించింది.