Reading Time: 2 minutes
Sarfaraz Khan : సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్.. సర్ఫరాజ్ క్యాచ్ చూసి నివ్వెరపోయిన అక్షర్ పటేల్

Sarfaraz Khan : ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరులో పరుగుల సునామీతో పాటు అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలు క్రికెట్ ఫ్యాన్సును మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గాలిలో తేలుతూ అతను బంతిని అందుకున్న తీరును చూస్తుంటే.. అతను క్రికెట్ ఆడుతున్నాడా లేక సర్కస్ చేస్తున్నాడా అనే రేంజ్‌లో ఉందీ ఫీట్.

చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో ఒక అద్భుతం జరిగింది. యువ పేసర్ గుర్జపనీత్ సింగ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని అక్షర్ పటేల్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి చాలా వేగంగా బ్యాక్ వర్డ్ పాయింట్ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపు వేగంతో స్పందించాడు. తన కుడివైపునకు అమాంతం గాలిలోకి డైవ్ చేసి, రెండు చేతులతో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. అది చూసిన అక్షర్ పటేల్ ఒక్క క్షణం నమ్మలేక క్రీజులోనే ఉండిపోయాడు. క్యాచ్ పట్టిన వెంటనే సర్ఫరాజ్ మైదానంలో పరిగెత్తిన తీరు అభిమానులను తెగ అలరించింది.

సర్ఫరాజ్ క్యాచ్ కంటే ముందే, 5వ ఓవర్‌లో నూర్ అహ్మద్ తన ఫీల్డింగ్ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని పతుమ్ నిస్సాంక బౌండరీ లైన్ వైపు గట్టిగా బాదాడు. అది క్లియర్‌గా సిక్సర్ వెళ్తుందని అందరూ భావించారు. కానీ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న నూర్ అహ్మద్ తన సర్వశక్తులూ ఒడ్డి గాలిలోకి ఎగిరి బంతిని పట్టుకున్నాడు. తాను బౌండరీ లైన్ దాటుతున్నానని గ్రహించి, వెంటనే బంతిని మైదానంలోకి విసిరేశాడు. తన టీమ్ కోసం ఒక ఖచ్చితమైన సిక్సర్‌ను అడ్డుకుని కేవలం ఒక పరుగుకే పరిమితం చేశాడు.

ఈ రెండు ఫీల్డింగ్ విన్యాసాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఒకవైపు అక్షర్ పటేల్ వంటి కీలక వికెట్‌ను సర్ఫరాజ్ అద్భుతమైన క్యాచ్‌తో తీయగా, మరోవైపు నూర్ అహ్మద్ విలువైన పరుగులను సేవ్ చేసి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మొదటి 8 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడటానికి చెన్నై ఫీల్డర్ల అప్రమత్తతే ప్రధాన కారణం. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ పట్టిన ఆ క్యాచ్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..