Reading Time: < 1 minute

ఇస్లామాబాద్: పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పాకిస్తాన్‌లో జరిగిన చారిత్రాత్మక అమెరికా ఇరాన్ చర్చల్లో అమెరికా ఇరాన్ విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది అని ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనంతరం, ఇరాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఘాలిబాఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో ఆయన మాట్లాడుతూ, మా బృందం ముందుచూపుతో కూడిన ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ చర్చల దశలో ప్రత్యర్థి పక్షం మా విశ్వాసాన్ని సంపాదించలేకపోయింది అని పేర్కొన్నారు. చర్చలకు ముందు తాము సత్సంకల్పంతో ముందుకు వచ్చామని, కానీ గత రెండు యుద్ధ అనుభవాల కారణంగా అమెరికాపై విశ్వాసం లేకపోయిందని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు.

మా సిద్ధాంతాలు, తర్కాన్ని అమెరికా గ్రహించింది. ఇప్పుడు మా విశ్వాసాన్ని పొందగలదా లేదా అన్నది వారి నిర్ణయం అని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడేందుకు శక్తివంతమైన రాజనీతితో పాటు సైనిక శక్తిని కూడా వినియోగిస్తామని ఘాలిబాఫ్ తెలిపారు రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా ఇరాన్ ప్రజల హక్కుల సాధనలో భాగమే. 40 రోజుల జాతీయ రక్షణ ద్వారా సాధించిన విజయాలను కాపాడేందుకు మా ప్రయత్నాలు ఎప్పటికీ ఆగవు అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలకు వేదిక కల్పించిన పాకిస్తాన్‌కు ఘాలిబాఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మద్దతుగా నిలిచిన ఇరాన్ ప్రజలను వీర ప్రజలుగా అభివర్ణిస్తూ, తమ బృందం చేసిన నిరంతర శ్రమను ప్రశంసించారు.

మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని విరమించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చల విఫలం కావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. మా చివరి, ఉత్తమ ప్రతిపాదనను సమర్పించాం. ఇరాన్ దానిని అంగీకరిస్తుందో లేదో చూడాలి అని ఆయన తెలిపారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యక్ష చర్చలు విఫలమవడంతో రెండు వారాల కాల్పుల విరమణ స్థిరత్వంపై సందేహాలు నెలకొన్నాయి. అలాగే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్థిరీకరణకు కీలకమైన హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు కూడా మసకబారాయి.