Reading Time: 2 minutes

జిల్లా పర్యటనలతో బిజి-బిజి

ఇప్పటికే పది జిల్లాల్లో పూర్తి

మన తెలంగాణ/హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో పదవులు రాలేదనో, మరే ఇతర కారణాలతోనైనా నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారా? అనే కోణంలోనూ పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ‘ఆరా’ తీస్తున్నారు. మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్-బై చెప్పడం పట్ల పార్టీలో కలకలం సృష్టించినందున భవిష్యత్తులో అటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తన భుజస్కందాలపైనే ఉందని ఆయన భావిస్తున్నారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసిలకు ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు గత నెలలో మహేష్ కుమార్ గౌడ్ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పది జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశారు. రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ పర్యటించనున్నారు. ఇదిలాఉండగా జిల్లా పర్యటనల సందర్భంగా ఎక్కడైనా అసంతృప్తి గళం వినిపిస్తే వారిని ముందుగానే నచ్చజెప్పే అంశాన్ని జిల్లా కార్యవర్గాలకు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సూచన చేయాలని ఆయన చెబుతున్నారు.

అయినా సద్దుమణగకపోతే తన వరకు ఆ అంశాన్ని తన వరకు తీసుకుని రావాలని ఆయన జిల్లా నాయకులకు చెబుతున్నారు. ఇంకా పార్టీకి-ప్రభుత్వానికి మధ్య సయోధ్య చెక్కు చెదరకుండా ఉండేందుకు తన ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. అంతకు ముందు నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు పర్యటించి మర్నాడు గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలకు కొత్తగా డిసిసి కార్యవర్గాలు ఏర్పాటైన తర్వాత పిసిసి చీఫ్ చేపట్టిన ఈ పర్యటనలకు ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు. జిల్లా పర్యటనల సందర్భంగా పార్టీ శ్రేణులను కలుసుకోవడమే కాకుండా ఆ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన కమిటీలతో సమావేశం కావడం గమనార్హం. జిల్లా కమిటీల పని తీరునూ ఆయన సమీక్షిస్తూ పార్టీపై పట్టు బిగిస్తున్నారు.

పిసిసి అధ్యక్షుని హోదాలో శుభకార్యాలకు హాజరుకావడం, హైదరాబాద్ గాంధీ భవన్‌లో మీడియా సమావేశాలు నిర్వహించడానికే తాను పరిమితం కాకుండా జిల్లాల్లో పర్యటిస్తూ, పార్టీ శ్రేణులను కలుసుకోవడం, వారితో మంచి-చెడ్డా చర్చించడం మంచిదని ఆయన భావిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలూ తనను కలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అనుయాయులు చెబుతున్నారు. ప్రజలను నేరుగా కలుసుకోవడం ద్వారా తనకూ పార్టీపై, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకూ అవకాశం లభిస్తుందని ఆయన భావిస్తున్నారు.

ఇదిలాఉండగా తాను చేపట్టిన జిల్లా పర్యటనలతో కార్యకర్తల నుంచి లభిస్తున్న ఆదరణ, ప్రజాభిప్రాయ సేకరణ పట్ల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతృప్తిగా ఉన్నారు. మిగతా పార్టీల నేతలు పాదయాత్రలనో, జిల్లా పర్యటనలనో చేపట్టడానికి ముందుగానే తాను ఈ పర్యటనలు చేపట్టడం మంచిదే అయ్యిందని ఆయన భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది జిల్లాల్లో పర్యటనలు పూర్తి కాగా, శనివారం ములుగు జిల్లా పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ఆదరణ, ఇంకా తనకు గజమాలతో స్వాగతం పలకడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఇదేవిధంగా మిగతా జిల్లాల్లోనూ పర్యటనలు కొనసాగించనున్నారు.

ప్రభుత్వ పథకాల అమలు పరిశీలన

మహేష్ కుమార్ గౌడ్ తన జిల్లా పర్యటనల్లో భాగంగా ప్రభుత్వ పథకాల అమలు తీరునూ పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా?, యువకులు, నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వం పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు? అనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన జిల్లా కమిటీలకు సూచిస్తున్నారు.

ఎంపిటిసీ, జెడ్‌పిటిసిలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.