Reading Time: < 1 minute
Shashi Tharoor Jab Pakistan Us Iran Talks

Shashi Tharoor: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సెటైర్లు వేశారు. దాయాది దేశంపై విమర్శలు చేస్తూనే, భారత్‌ను సమర్థించారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ‘‘డ్రాఫ్ట్- ఎక్స్ కోసం పాకిస్తాన్ ప్రధాని మెసేజ్’’ అనే ఎడిట్-హిస్టరీ హెడల్ ఉన్నట్లు కనిపించింది. అమెరికా పంపిన మెసేజ్‌నే షరీఫ్ పోస్ట్ చేశారు.

Read Also: US-Iran War: యుద్ధం మళ్లీ మొదలవుతుందా.? ఇరాన్‌‌కు చైనా నుంచి అత్యాధునిక ఆయుధాలు..

ఈ వైరల్ పోస్టుపై స్పందించిన థరూర్.. ‘‘అమెరికా, పాకిస్తాన్ కు ఎలాంటి సంబంధం ఉందో మీకు తెలుసా.?’’ అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధాని కోసం అమెరికా ఆ ట్వీట్ రాసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ మీరు, నేను భారత ప్రధాని కోసం ఎదైనా రాస్తే, దానిపై ‘‘భారత ప్రధాని కోసం డ్రాఫ్ట్’’ అని రాస్తామా? అని అడిగారు. షరీఫ్ చేసిన పోస్టు కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన పోస్ట్‌ను పోలి ఉందని అన్నారు. అమెరికా కోసం ఇలాంటి పాత్ర పాకిస్తాన్ మాత్రమే పోషించగలదని ఎద్దేవా చేశారు.

ఇరాన్ యుద్ధం జరిగితే మొదటి ప్రభావం దానితో సరిహద్దు పంచుకున్న పాకిస్తాన్‌పై పడుతుందని, శరణార్థుల భారం పాకిస్తాన్ భరించాల్సిందే అని ఆయన అన్నారు. శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూనే, భారత్‌కు ఎవరు మధ్యవర్తిత్వం చేస్తున్నారనేది ముఖ్యం కాదని, ఫలితం ఏంటనేదే ముఖ్యమని థరూర్ చెప్పారు. దౌత్యపరంగా మౌనం కూడా ఒక సహకారమే అని ఆయన అన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, భారత్‌కు ఎదురుదెబ్బ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు థరూర్ చెక్ పెట్టినట్లు అయింది.