
న్యూఢిల్లీ: డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతి సుంకాలను భారీగా పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పూ చేయలేదు. డీజిల్ ఎగుమతిపై సుంకాన్ని లీటరుకు రూ.21.5 నుంచి రూ.55.5కు పెంచారు. విమాన ఇంధనంపై సుంకాన్ని లీటరుకు రూ.29.5 నుంచి రూ.42కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావం విమాన చార్జీలపై పడకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
అంతర్జాతీయంగా చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు రక్షణ కల్పించేలా పన్నులు, ఇతర చార్జీలను అధికారులు సమీక్షిస్తున్నారు. దేశీయంగా చమురు లభ్యతను పెంచి ధరలను అదుపులో ఉంచడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.