
21 గంటల చర్చలు విఫలం
పాకిస్తాన్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కూలిపోయాయి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో జరిగిన చారిత్రాత్మక 21 గంటల అమెరికాఇరాన్ శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. దీంతో రెండు వారాల సున్నితమైన కాల్పుల విరమణ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. చర్చలు విఫలమయ్యేందుకు ఒకరినొకరు బాధ్యులుగా రెండు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, యుద్ధాన్ని ముగించేందుకు వాషింగ్టన్ పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించలేదని తెలిపారు. అమెరికా తమది చివరి, ఉత్తమ ప్రతిపాదన అని సమర్పించినప్పటికీ, ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడంలో ఆసక్తి చూపలేదని ఆయన పేర్కొన్నారు.
యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో చర్చలు విఫలం కావడానికి ఆ దేశమే కారణమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ, 21 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా తమ ప్రతినిధి బృందం సానుకూల ప్రతిపాదనలను అందించింది. అయినప్పటికీ.. అమెరికన్లు తమ నమ్మకాన్ని సంపాదించగలదా లేదా అన్నది అమెరికా నిర్ణయించుకోవాల్సిన విషయం అని ఎక్స్ వేదికగా చెప్పారు. “యుద్ధం ముగింపు విషయంలో మాకు సదుద్దేశం, సంకల్పం ఉన్నాయని చర్చలకు ముందే చెప్పాం. కానీ గత రెండు యుద్ధాల అనుభవం కారణంగా మాకు అవతలి పక్షంపై నమ్మకం లేకుండా పోయింది. చర్చల సమయంలో మా ప్రతినిధులు దూరదృష్టితో కూడిన కొన్ని ప్రతిపాదనలు చేశారు. కానీ మా నమ్మకాన్ని పొందండంలో అమెరికా విఫలమైంది. ఇరాన్ అంటే 9 కోట్ల ప్రజల సముదాయం. సుప్రీం లీడర్ పిలుపుకు స్పందించి వారంతా వీధుల్లోకి వచ్చారు. మా ప్రజల హక్కుల సాధనకు సైనిక పోరాటంతో పాటు దౌత్యం కూడా ఒక మార్గమని భావిస్తున్నాం. అదేవిధంగా 40 రోజుల యుద్ధంలో సాధించిన విజయాలను సుస్థిరం చేసుకునే దిశగా మా ప్రయత్నాలను విరమించుకోం అని ఘాలిబఫ్ అన్నారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పెట్టిందని విమర్శించింది. ఈ చర్చలు విఫలమవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల స్థిరీకరణకు కీలకమైన హార్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై ఆశలు తగ్గిపోయాయి. అమెరికా మళ్లీ ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభిస్తుందా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
ఇరాన్ హామీ ఇవ్వలేదు..
పాకిస్థాన్ వేదికగా ఇరాన్‌అమెరికాల మధ్య నిర్వహించిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జేడీ వాన్స్ మాట్లాడుతూ, 21 గంటలపాటు మేము ఇరానీయులతో గంభీర చర్చలు జరిపాం. ఇది మంచి విషయం. అయితే ఒప్పందం కుదరలేదు. ఇది అమెరికాకంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదనే స్పష్టమైన హామీ అవసరం అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం ఇరాన్‌కు అణ్వాయుధాలు అందకుండా నిరోధించడమేనని వాన్స్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చర్చలు జరిపినట్టు చెప్పారు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ, ఫ్రీజ్ చేసిన ఆస్తుల విడుదల వంటి అంశాలపై విభేదాలు చర్చల విఫలానికి దారితీశాయి. ఘాలిబాఫ్ సోషల్ మీడియాలో పేర్కొంటూ, ఇరాన్ పక్షం ముందుచూపు కలిగిన ప్రతిపాదనలు చేసినప్పటికీ, ప్రత్యర్థి పక్షం విశ్వాసాన్ని పొందలేకపోయిందని తెలిపారు. ఇరాన్ ప్రజల హక్కులను కాపాడటానికి రాజనీతితో పాటు సైనిక పోరాటం కూడా కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు.
హార్మూజ్‌జలసంధి
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ మాట్లాడుతూ, చర్చల విజయవంతం అవ్వడం ప్రత్యర్థి పక్షం నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అధికమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను నివారించాలి అన్నారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అంశం కూడా చర్చల్లో అడ్డంకిగా మారిందని తెలిపారు. 40 రోజుల యుద్ధం తర్వాత, అనుమానాలు, అవిశ్వాసం నడుమ ఈ చర్చలు జరిగాయి. ఒకే సమావేశంలో ఒప్పందం సాధ్యమవుతుందని ఆశించలేం. అమెరికా, ఇరాన్ అభిప్రాయాలను దగ్గర చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయి అని బఘాయ్ అన్నారు. ఇక పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ, ఇరాన్‌అమెరికా శాంతి చర్చలకు తమ దేశం మధ్యవర్తిత్వం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణను అంగీకరించినందుకు రెండు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా బృందంలో వెస్ట్ ఆసియా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు మరియు వైట్ హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల కాల్పుల విరమణ ప్రకటించిన నాలుగు రోజుల తరువాత ఇవి జరిగాయి.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికాఇరాన్ మధ్య జరిగిన మొదటి ప్రత్యక్ష, ఉన్నత స్థాయి చర్చలు ఇవే. ఇరాన్ చర్చల కోసం 10 పాయింట్ల ప్రణాళికను సమర్పించింది. ఇందులో పశ్చిమ ఆసియాలో నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ వంటి డిమాండ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించడంతో ఈ ఘర్షణ మొదలైంది. దీంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు దెబ్బతిని, అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమైంది. పశ్చిమ ఆసియా భద్రత, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, అంతర్జాతీయ రాజనీతిపై దీర్ఘకాల ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఈ చర్చలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు.