
టెహ్రాన్: అమెరికా నేవీకి చెందిన నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయన్న వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది. యూఎస్ నేవీ షిప్‌లు హార్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించ లేదని క్లారిటీ ఇచ్చింది. జలసంధి గుండా వెళ్ళడానికి ప్రయత్నించిన ఒక అమెరికా సైనిక నౌకను ఇరాన్ దళాలు జోక్యం చేసుకుని వెనక్కి మళ్లించాయని తెలిపింది.
ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా వెళ్లే ఏ నౌకపైనైనా నియంత్రణ తమ సాయుధ దళాల చేతిలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసిన విషయం తెలిసిందే.
అమెరికా వాదన ఇలా:
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలయ్యాక తమ నౌకలు తొలిసారి హార్మూజ్‌జలసంధి మీదుగా ప్రయాణించాయని అమెరికా అధికారులు వెల్లడించారు. ఆరు వారాల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలమార్గం మీదుగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించడం ఇదే మొదటిసారి అని అధికారులను ఉటంకిస్తూ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్ట్ చేసింది.
ఎలాంటి ఇబ్బంది లేకుండా నౌకలు హార్మూజ్మీదుగా ప్రయాణించాయని.. ఈ చర్యను నౌకాయాన స్వేచ్ఛ మిషన్‌గా అమెరికా అధికారులు చెప్పుకొచ్చారు. ఇవి వాణిజ్య నౌకలకు రక్షణగా వెళ్లడం లేదని అధికారులు స్పష్టం చేశారు. నేవీకి చెందిన రెండు క్షిపణి విధ్వంసక నౌకలు హార్మూజ్‌జలసంధి మీదుగా ప్రయాణించాయని అమెరికా చెప్పింది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతోన్న వేళ యూఎస్ నౌకలు హార్మూజ్ మీదుగా వెళ్లడం సానుకూల సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి మీదుగా అమెరికా నౌకలు వెళ్లాయన్న వాదనను ఇరాస్ తిరస్కరించడం గమనార్హం.