
సోమాలియాలో మేము
అందిస్తున్న సేవలకు గాను
బిలియన్ డాలర్ల నగదు చెల్లించండి
నెల రోజుల్లోగా నా డిమాండ్లకు
అంగీకరించకపోతే తీవ్ర
పరిణామాలు టర్కీకి ఉగాండా
ఆర్మీ చీఫ్ ముహూజీ హెచ్చరిక
టర్కీకి ఉగాండా సైన్యాధిపతి
కైనెరూగాబా హుకుం
లేకపోతే దౌత్యబంధాన్ని
తెంచుకుంటామని హెచ్చరిక
కంపాలా: ఉగాండా సైన్యాధిపతి, అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ కుమారుడు ముహూజి కైనెరూగాబా టర్కీపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. టర్కీ తమకు 1 బిలియన్ డాలర్లు చెల్లించడంతో పాటు దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిని తనకు భార్యగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 30 రోజుల్లో ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే దౌత్యపరమైన సంబంధాలను తెంచి, కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఎక్స్ లో చేసిన పలు పోస్టుల్లో కైనెరూగాబా మాట్లాడుతూ, ప్రాంతీయ భద్రత కోసం ఉగాండా చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించలేదని, అందుకు ఆర్థిక పరిహారం రావాల్సిందేనని పేర్కొన్నారు. టర్కీ సోమాలియాలో, ముఖ్యంగా రాజధాని మొగాదిషులో పోర్టులు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందుతుండగా, భద్రతా బాధ్యతలను ఉగాండానే భుజాన వేసుకుందని ఆయన ఆరోపించారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఉగాండా సైన్యం ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా సోమాలియాలో సేవలందిస్తోంది. ముఖ్యంగా అల్-షబాబ్ అనే అల్-ఖైదా అనుబంధ మిలిటెంట్ సంస్థను ఎదుర్కొనేందుకు ఈ దళాలు పనిచేస్తున్నాయి.టర్కీకి ఇది చాలా సులభమైన ఒప్పందం… వారు మాకు డబ్బు చెల్లించాలి, లేకపోతే వారి రాయబార కార్యాలయాన్ని మూసివేస్తాను. వారు కూడా టర్కీలోని మా రాయబార కార్యాలయాన్ని మూసివేయవచ్చు.. మాకు ఎలాంటి సమస్య లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉగాండాటర్కీ సంబంధాలు గంభీరమైనవి అని పేర్కొన్న ఆయన, వాటిని సోషల్ మీడియా నాటకంగా చూడకూడదని అన్నారు. త్వరలోనే దౌత్య సంబంధాలను తెంచేస్తాం అంటూ హెచ్చరించారు. వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఎవరికీ అవసరం లేదు అని కూడా ఆయన విమర్శించారు. ఇంకా, భద్రతా కారణాల దృష్ట్యా ఉగాండా ప్రజలు టర్కీకి ప్రయాణించకుండా ఉండాలని సూచించారు. ఇదే సమయంలో, ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తూ, నా ఆధ్వర్యంలో 1 లక్ష మంది ఉగాండా సైనికులను పంపడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన తెలిపారు. ఇది కైనెరూగాబా నుంచి వచ్చిన మొదటి వివాదాస్పద వ్యాఖ్య కాదు. 2022 అక్టోబర్‌లో ఆయన, జార్జియా మెలోనిను వివాహం చేసుకోవడానికి 100 అంకోల్ గోవులను ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించి వివాదం సృష్టించారు.