
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల గద్దెల వద్ద గాయపడి చికిత్స పొందుతున్న బాలుడికి మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మేడారం సమ్మక్క దేవత పూజారి రాణా రమేశ్ కొడుకు యువిన్ గత నెల 25న ప్రమాదవశాత్తు రాతి శిలపై పడటంతో తీవ్రంగా గాయపడి హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం బాలుడి పుట్టినరోజు కావడంతో విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క హాస్పిటల్కు కేక్ తీసుకెళ్లి పుట్టినరోజు వేడుకలు జరిపించారు.
బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో స్నేహ ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.