
తాజా కితాబ్: మీరు బట్టల షాపుకు వెళతారు. అక్కడ ఒక స్వర్ణ, మీరు అడిగినవి అడగనివి విసుగు చెందకుండా చూపిస్తుంది. మీరు ఒక హాస్పిటల్ కు వెళతారు. అక్కడ ఒక స్వర్ణ రిసెప్షన్‌లో ఉండి మీకు కావలసిన సహాయాన్ని అందించి డాక్టర్ దగ్గరకు మీ ఫైల్‌తో సహా మిమ్మల్ని పంపిస్తుంది. మీరు ఒక హోటల్‌కి వెళ్తారు. అక్కడ మరొక స్వర్ణ మీ ఆకలిని తీర్చడానికి మెనూ కార్డుతో తయారుగా ఉంటుంది. వర్తమాన సమాజంలో చదువు పెద్దగా లేకపోయి నా, చిన్నచిన్న ఉద్యోగాలతో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న స్వర్ణలు ఎందరో ఉంటున్నారు. పనిచేసే దగ్గర కూర్చోవడం అనేది ఒక హక్కుగా కేరళ, తమిళనాడులలో మహిళలు సాధించుకున్నారు. చేసే పనికి సంబంధించి, యజమానుల దాష్టీకాలకు సంబంధించి, అనుమానపు చూపులకు సంబంధించి రకరకాల సమస్యలను ఈ మ హిళలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారి స మస్యలను పట్టించుకొని వారికి కొంత బాసటగా నిలువమంటున్నారు రచయిత్రి పి.సత్యవతి.
ఇల్లలకగానే, సూపర్ మామ్ సిండ్రోమ్, దమయంతి కూతురు లాంటి అద్భుతమైన కథలను అందించిన సత్యవతి ఇప్పుడు ‘ఇట్లు మీ స్వర్ణ’ అనే 11 కథల సంపుటితో పాఠకుల ముందుకు వచ్చారు. ఈ సంపుటిలోనే అన్ని కథల్లోనూ స్వర్ణ పాత్ర ఉంది. మన ఇళ్లల్లో పనిచేసే స్వర్ణ కావ చ్చు, షాపింగ్ మాల్స్‌లో పనిచేసే స్వర్ణ కావచ్చు, మాల్స్‌లో సరుకులు ప్యాక్ చేసే స్వర్ణ కావచ్చు, మన ఇళ్లల్లో నడవలేని, మంచాన పడిన ముసలివారికి సేవ చేసే నర్సింగ్ స్వర్ణ కావచ్చు, ఇలా మన చుట్టూ ఎందరో స్వర్ణలు ఉన్నారు. వారి ఆలోచనలను వినండి. అవసరమైతే వారికి చేయూతనివ్వండి. అవకాశం ఉంటే చదువుకోవాలనుకునే వారికి చదువుకోడానికి ప్రోత్సా హం ఇవ్వండి. వాళ్ల జీవితాలను నిర్దేశిస్తున్న ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు, ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, అమ్మ ఒడులు వీటన్నిటి పట్ల వారికి అవగాహన కల్పించండి. వారిని సమాజంలో భాగంగా ఎదగనివ్వండి అంటున్నారు పి.సత్యవతి.
ఏదో ఒకలా పదో తరగతి వరకు ఈడ్చుకొచ్చి పది గట్టెక్క లేకపోతే, ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఆమె పట్ల చూపే నిరాదరణ లేదా ప్రతి పనికి వారిని ఉపయోగించుకునే తీరు ‘ప్రశ్న పత్రంలో ఈ క్రింది ఖాళీలను సరైన క్రియ పదములతో పూరింపుము’ అన్నట్లుగా వారి ఖాళీ తనాన్ని ఏదో ఒక పనితో పూరిస్తారు అంటారు రచయిత్రి. పనిచేసే చోట దొరికే చిన్న చిన్న సంతోషాలకే సంతృప్తిపడి కష్టపడి పనిచేసే స్వర్ణలు ఏమి కోరుకుంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీళ్ల శ్రమను గుర్తించాలని అనుకుంటారు. వాళ్ల కి పెళ్లి చేసి పంపటంతో బాధ్యత తీరిందనుకోడానికి లేదు. అప్పటివరకు కుటుంబానికి చేదోడుగా ఉన్నవారు, పరాయి ఇంటికివెళ్లి భర్త చేత తిట్లు, తన్నులు తింటూ అక్కడ ఉండలేక తిరిగి పుట్టింటికి వచ్చి తమ రెక్కల శ్రమను నమ్ముకోవాల్సిన స్థితిని సత్యవతి ఈ కథల్లో ఆవిష్కరించారు. ఈ స్వర్ణల ఉద్యోగాలకు భద్రత ఉండదు. వీరి తల్లిదండ్రులు కూడా వారు చేసే ఉద్యోగాలను ఉద్యోగాలుగా తలచరు. పెళ్లి చేసి పంపే అంతవరకు కాలక్షేపం గానూ, వాళ్ళు తెచ్చే రెండు రాళ్లు తమ కుటుంబానికి ఉపయోగపడే విధంగానూ ఉంటాయి అనుకుంటారు తప్ప, అంతకు మించిన ఆలోచన చేయరు. మన చుట్టూ ఉన్న పేదరికపు గీతకు కింద ఉన్న వీరందరి వైపు ఓసారి చూడమని, వీరిని పట్టించుకోమని తన కథల ద్వారా చెబుతున్నారు సత్యవతి.
– బండ్ల మాధవరావు