
తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సింగర్ మంగ్లీ హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2026 ఏప్రిల్ 12వ తేదీన పంజాగుట్ట స్టేషన్ కు వచ్చిన మంగ్లీ.. సింగపోగు సుబ్బు అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనపై సింగపోగు సుబ్బు దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మంగ్లీ. సుబ్బు తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులకు తెలిపారు. డబ్బు ఇవ్వనందుకు దుర్భాషలాడుతూ మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇప్పటికే మంగ్లీపై పంజాగుట్ట పీఎస్ లో మైక్రో ఫైనాన్స్ పేరుతో 10 కోట్ల రూపాయల మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
►ALSO READ | కేసు టేకప్ చేయాలా.. డబ్బు, మందు బాటిళ్లు పంపించు.. మీర్పేట్ ఎస్సై నిర్వాకం
అంతకు ముందు (ఏప్రిల్ 11న) హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుబ్బు సింగపోగుపై మంగ్లీ ఫిర్యాదు చేశారు. 150 కోట్లకు మోసం చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 21న సుబ్బు సింగపోగు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని మంగ్లీ ఫిర్యాదులో తెలిపింది. అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని తెలిపింది. తనను కలవాలని ఒత్తిడి చేశాడని, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో మంగ్లీ పేర్కొంది.