Reading Time: < 1 minute

కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్‌ః

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు జాగ్రత్త అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని పార్టీలను హెచ్చరించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మహిళా బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. మహిళలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నది దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఆలోచన అని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయంగా ఉండిపోతుందని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఈ బిల్లుకు మద్దతునివ్వాలని ఆయన కోరారు. మహిళలు ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఆయన తెలిపారు. పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని ఆయన తెలిపారు. డీలిమిటేషన్‌తో పార్లమెంట్‌లో స్థానాలు పెరుగుతాయని, తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వివరించారు.