
స్వాప్ నంబర్ ప్లేట్స్
పట్టుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు
ఫొటొః బిఎం పేరుతో ఉంది…
మనతెలంగాణ, సిటిబ్యూరో: ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి కారు యజమాని చేసిన పని చూసి ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బిఎండబ్లూ కారుకు స్వాప్ నంబర్ ప్లేట్ అమర్చి తిరుగుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ వచ్చాడు. అతడికి బ్రీత్ పరీక్ష నిర్వహించగా మద్యం తాగి వాహనం నడిపినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు కారును స్వాధీనం చేసుకునేందుకు పరిశీలిస్తుండగా కారుకు ఉన్న నంబర్ ప్లేట్ మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారుకు చైనీస్ ఫ్లాగ్‌షిప్ నంబర్ ప్లేట్ అమర్చిన కారు యజమాని దానిని రిమోట్ సాయంతో మార్చుతుండడంతో డిఎల్ 6 సిఎం 7097, టిఎస్ 9 ఎఫ్‌క్యూ 9999 నంబర్ ప్లేట్లు మారుతున్నాయి. వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ చలాన్లు తప్పించుకోవడానికి ఖరీదైన బిఎండబ్లూ కారు నంబర్ ప్లేట్ మార్చడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటివి చూడలేదని, ఇదే మొదటిసారి పోలీసులు తెలిపారు. గతంలో ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌ను డ్యామెజ్ చేయడం, మాస్కువేయడం చేసేవారు. ఇప్పుడు ఏకంగా రిమోట్ సాయంతో నంబర్ ప్లేట్‌ను మార్చుతున్నారు. దీనిని చూసి ఎంతమంది అనుసరిస్తారోనని, ప్రతి కారును ఇక నుంచి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.