Reading Time: < 1 minute
MI vs RCB: వాంఖడే వేదికగా అన్నదమ్ముల ‘కోల్డ్ వార్’.. ఆ విబేధాలకు చెక్ పడేనా..?

Hardik Pandya vs Krunal Pandya: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, బెంగళూరు తరపున ఆడుతున్న కృణాల్ పాండ్య ఒకరికొకరు ప్రత్యర్థులుగా నిలవనున్నారు. వీరిద్దరూ ఆల్ రౌండర్లుగా తమ జట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఈ సోదరులిద్దరూ కలిసి ముంబై తరపున ఆడినప్పటికీ, ఇప్పుడు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సోదరుల మధ్య దూరం పెరిగిందా?

గత కొన్ని నెలలుగా పండ్య సోదరుల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీమ్ ఇండియా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు హార్దిక్ ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే, ఆ విజయంపై గానీ, హార్దిక్ ప్రదర్శనపై గానీ కృణాల్ ఎక్కడా స్పందించలేదు. అటు హార్దిక్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా కృణాల్ మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. వీరిద్దరి మధ్య మాటలు లేవని వస్తున్న వార్తల నేపథ్యంలో, మైదానంలో వీరి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుత సీజన్‌లో ప్రదర్శన..

ఈ 19వ సీజన్‌లో హార్దిక్ పాండ్య ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచులలో 27 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. మరోవైపు బెంగళూరు తరపున ఆడుతున్న కృణాల్ పండ్య బ్యాటింగ్‌లో తడబడుతున్నప్పటికీ, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. మూడు మ్యాచుల్లో బ్యాటుతో కేవలం ఒక్క పరుగే చేసిన కృణాల్, బంతిని అందుకుని నాలుగు వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగమయ్యాడు.

ముగియనున్న కోల్డ్ వార్..?

క్రికెట్ మైదానం ఎంతోమంది శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. వాంఖడే మైదానంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా అన్నదమ్ముల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, పాత రోజుల్లా కలిసిపోతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకరి వికెట్ మరొకరు తీసినప్పుడు లేదా మైదానంలో ఎదురుపడినప్పుడు వారి స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..