Reading Time: 3 minutes

వలస మానవ జీవన ప్రయాణంలో అవసరమైన మజిలీ. ఉన్న చోట కష్టాల నుండి బయటపడడానికో లేదా మరింత బాగా బతుకు సాగాలనే ఆశతో మనిషి ప్రవాసానికి సిద్ధమవుతాడు. అయితే అలా వేసిన అడుగుల వల్ల ఎదురయ్యే మేలు గాని, కీడు గాని తీరం చేరితేనే అర్థమవుతుంది. సాధారణంగా పొట్ట చేతబట్టుకొని బయలుదేరిన మనిషి అవసరాన్ని, దిక్కులేనితనాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం, ఇస్తామన్న కూలి సొమ్మును తగ్గించే, వీలైతే ఎగ్గొట్టే ఆలోచన వ్యాపార లక్షణం. కార్చిన చెమట తూకం కన్నా దక్కిన లాభం లెక్కలే ముఖ్యమైన కాలంలో దేశ దేశాల్లో వలస జీవుల వెతలు ఇన్నీ అన్నీ కావు. అయితే చరిత్ర రచనలో ఇదొ క విస్మృత కోణం. సాహిత్యంలో దొరకని చీకటి అధ్యాయం. ఎవరికీ అక్కర లేనట్లు మగ్గిపోయిన ఈ వలస లెక్కలపై, మూలాల ముచ్చటపై రచయిత ముకుంద రామారావు దృష్టి పడింది. ఆ ఆసక్తి, శ్రమ ఫలితమే ‘అగమ్య గమ్యాలు’.

వ్యాసాల రూపంలో ఆయన రాసిన ఈ పుస్తకం వల్ల వందేళ్ల వలస కార్మికుల చరిత్ర ఓ గమ్యానికి చేర్చింది. బ్రిటీష్ పాలన లో ఒప్పంద కార్మిక వలస విధానంలో భారతీయ శ్రమజీవుల కన్నీటి గాధలు ఈ రచన ద్వారా వెలుగు చూశాయి. ప్రతి పేజీలో ముకుంద రామారావు విషయ సేకరణ కోసం చేసిన కృషి కనబడుతుంది. ఇది నిన్న మొన్నటి సంగతి కాదు, రెండు వందల ఏళ్ల వెనుకటిది. ఆ బాధలు అనుభవించిన వారు తమ పిల్లలకు కూడా చెప్పుకోనంత దుర్భరమైనవి. మీరు బాగుంటే చాలు, మా కష్టాల ఏకరువు మీకెందుకు అని దాటేసిన ఆ నా టి క్రూర జ్ఞాపకాలు అవి. అక్కడా, ఇక్కడా దస్తావేజుల్లో మిగిలిన గణాంకాలు, ఆర్కైవ్ రికార్డులు, నవలల్లో, కవితల్లో నిక్షిప్త సమాచారం ఈ రచనకు మూలాధారాలు. సుమారు దశాబ్ద కాలపు రచయిత వెదుకులాట ఫలితమీ గ్రంథం.

ఒప్పంద వలస జీవుల చరిత్ర వెలికితీయాలన్న రామారావు కాంక్షకు ఓ నేపథ్యం ఉంది. ఆ విషయాన్ని రచయిత తన మాటలో వివరించారు. ‘మా తాతయ్య 19041914 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా వెళ్లారు. మా నాన్న అక్కడే పుట్టారు. ఆ ముందూ, వెనుకా, మా తాతయ్య, నానమ్మలలాంటి వాళ్లు వేల కొద్దీ వెళ్లారని, ఒక్క దక్షిణాఫ్రికానే కాదు, అనేక దేశాలకు రైతులుగానో, కార్మికులుగానో వలస వెళ్లారని, అలా వెళ్ళినవారు పడరాని కష్టాలు పడ్డారని తెలిసి, వారిలో ఒకరిలా మా నసిక క్షోభ అనుభవించాను. ఒప్పంద కార్మికుల చరిత్రను న మోదు చేయడం బాధ్యతగా భావించి, వారందరి వారసుడిగా నేను చేస్తున్న చిరు ప్రయత్నం ఇది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి రాజ్యాల్లో 1833లో బానిస వ్యవస్థ రద్దు అయ్యాక దాని స్థానాన్ని పూరించేందుకు చట్టబద్దమైన ఒప్పంద వలస కార్మికుల వ్యవస్థ ఏర్పడింది. అయిదు, పదేళ్ల రాతపూర్వక అంగీకారం పైకి పద్ధతిగానే ఉండేది.

ఇది పూర్తిగా బానిసత్వమూ కాదు, పూర్తి స్వేచ్ఛా కాదు అంటారు రచయిత. అలా 1834-1920 మధ్య కాలంలో ప్రపంచంలోని 19కి పైగా వలస రాజ్యాలకు దాదాపు 13 లక్షల మంది భారతీయులు ఒప్పంద వలస కార్మికులుగా వెళ్లారు. సుదీర్ఘమైన, ప్రమాదభరిత ప్రయాణాలవి. కలకత్తా నుండి జమైకాకు 180 రోజుల సముద్రయానం. ఓడ ఎక్కిన వారంతా గమ్యం చేరుతారన్న గ్యారెంటీ లేదు. విషజ్వరాలు, కలరా, అగ్ని ప్రమాదాలు, ఓడ ధ్వంసం ఇలా ఎన్నో ఉపద్రవాల నడమ ప్రయాణం సాగేది. మార్గంమధ్యలో ఎందరో చనిపోయేవారు. మెడకు తగిలించిన బిళ్లలోని నెంబరే వారి గుర్తింపు. పని స్థలాల్లో అత్యంత కఠినమైన నిబంధనలు ఉండేవి. ఒక రోజు పనికి రాకపోతే రెండు రోజుల వేతనం కోత పెట్టేవారు.

చేసిన పని నచ్చకపోతే కొట్టేవారు, జరిమానా వేసేవారు. జైలుకు పంపేవారు. ఒప్పంద కాలాన్ని పెంచేవారు. వెరసి ఎంతో మందికి ఈ ఒప్పంద వలస కార్మిక జీవితం యావజ్జీవ దేశ బహిష్కరణగా మారిపోయింది. అందుకే వెళ్లిన 13లక్షల మందిలో సుమారు 3లక్షల వరకే స్వదేశానికి తిరిగి వచ్చినట్లు రికార్డుల్లో ఉంది. వందేళ్లుగా బ్రిటీష్, ఫ్రెంచ్, డచ్ వలస దేశాల్లో మిగిలిన భారత సంతతి అక్కడే ఉండిపోయింది. వాళ్లు మిశ్రమ సాంప్రదాయ జీవితాలు గడుపుతున్నారు. అత్యధికంగా నాలుగున్నర లక్షల మంది మారిషస్‌లో మిగిలిపోయారు. ట్రినినాడ్ జనాభాలో 40% వలస కార్మికుల వారసులే. కరేబియన్ దీవులకు వెళ్లిన 4లక్షల వలస కార్మికుల్లో అక్కడే స్థిరపడ్డవారు అధికం. భారతీయ మూలాలు, పూర్వీకుల స్పష్టమైన ఆధారాలు లేకపోవడమే అందుకు కారణమని రచయిత అంటారు. పేర్లు కూడా మారిపోయి గణపతి చివరకు కెనబడీ అయింది.

మన దేశంలో వచ్చిన కరువుకు, వలసలకు ప్రత్యక్ష సంబం ధం ఉందని రచయిత సోదాహరణంగా వివరించారు. భారతదేశంలో పెద్ద ఎత్తున వచ్చిన కరువులన్నీ బ్రిటిష్ పాలనలోనే రావడం జరిగింది. కరువు సమయంలోనూ ఆహార ధరలు తగ్గించడానికి బ్రిటిష్ పాలకులు అంగీకరించలేదు. ఈ విపత్తులను తట్టుకోలేక, మరో గత్యంతరం లేక ప్రజలు వలసలకు పాల్పడ్డారు.తమ పాలక దేశాల్లో పంటలకు, పరిశ్రమలకు, రైలు మార్గ నిర్మాణాలకు కూలీల అవసరాల దృష్ట్యా బ్రిటీష్ పాలకులు వలసల అనివార్య పరిస్థితిని కల్పించారు. లక్షలాదిగా భారతీయుల వలస కార్మిక నికృష్ట బతుకులకు, వారి వారసులు ఆయా దేశాల్లోనే మగ్గిపోవడానికి పరోక్షంగా బ్రిటిష్ పాలనే కారణమని రచయిత పేర్కొన్నారు.

వలస కార్మికుల వెతలతో వెలువడ్డ సాహిత్యాన్ని రామారావు చాలా మట్టుకు సేకరించారు. కవిత్వాన్ని చాలా చోట్ల పరిస్థితుల వివరణ కోసం వాడుకున్నారు. వలస దేశాల వివరాలు తెలిపే క్రమంలో అక్కడి వలస సంతతి రచనలను అనుబంధంగా ఇచ్చారు. చాలా కవితల్లో వేదన, దుఃఖం, నిస్సహాయత, మూలాలు కోల్పోయిన ఏకాకితనం నిండి ఉంది. భారతీయ ఒప్పంద వలస కార్మికుల కష్ట నష్టాలను రచయిత ముకుంద రామారావు ఎంతో సమర్థవంతంగా, హృద్యంగా చిత్రించారు. తెలుగు సాహిత్యంలో అరుదైన గ్రంథ రచన ఇది. గొలుసులతో బంధించి ఆఫ్రికా నుండి బానిసలను తీసుకుపోయినట్లు, భారతీయ ఒప్పంద కార్మికుల తీసుకు వెళ్లక పోయినా రెంటికి పెద్ద తేడా లేదని తొలి అధ్యాయంలో రచయిత అన్నమాట పుస్తకం చదివాక అర్థమవుతుంది. రచయిత విషయ సేకరణ, ఒక క్రమంలో వాటిని కూర్చిన తీరు, అక్కడక్కడా తన ఉద్వేగాన్ని వ్యక్తపరచిన సందర్భాలు పుస్తకానికి పరిపూర్ణతనిచ్చాయి.

– బద్రి నర్సన్