
చెన్నై: అనుమానంతో ప్రియురాలిని ప్రియుడు హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లా కున్నం తాలూకాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. పుదువెట్టక్కుడి గ్రామానికి చెందిన పచ్చముత్తు, సత్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నందిని(25) అనే మహిళకు భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులు, కూతురుతో కలిసి ఉంటుంది. పెరంబలూర్‌లో పని చేస్తుండగా నందినికి పచ్చముత్తు పరిచయం కావడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సత్యకు తెలియడంతో పలుమార్లు భర్తను మందలించింది. భర్తలో మార్పు రాకపోవడంతో సత్య ఆత్మహత్య చేసుకుంది. పెరంబలూరులోని భారతీనగర్‌లో నందినితో కలిసి పచ్చముత్తు ఉంటున్నాడు. నందిని ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆమెపై పచ్చముత్తు అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రియుడు ఆమెను ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆగ్రహంతో ఆమెపై దాడి చేయడంతో చనిపోయింది. వెంటనే పెరంబలూర్ పోలీస్ స్టేషన్‌లో అతడు లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.