Reading Time: 2 minutes

ఆ మూడు బ్యాంక్ అకౌంట్లు ఎవరివి?…రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ కేసులో నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు

Caption of Image.
  •     డ్రగ్స్ పెడ్లర్ల అకౌంట్లతో అనుమానిత అకౌంట్ల లింకులు 
  •     జాడలేని పెడ్లర్లు, అకౌంట్లు ఎవరివో చెప్పని రోహిత్ రెడ్డి
  •     నాలుగు కస్టడీలు, ఎనిమిది రోజుల విచారణలో తేలని డ్రగ్స్ లెక్కలు

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌‌హౌస్ కేసులో డ్రగ్స్‌‌ పెడ్లర్లు, ఆర్థికలావాదేవీల చుట్టూ సిట్‌‌ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్‌‌ పెడ్లర్లతో లింకైన మూడు అనుమానిత బ్యాంక్‌‌ అకౌంట్లు ఎవరివనే కోణంలో సిట్ విచారిస్తోంది. కాగా, నిందితులను నాలుగు సార్లు కస్టడీకి తీసుకున్న సిట్‌‌.. వారి నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం రాబట్టలేకపోయినట్లు తెలిసింది. 

దీంతో పెడ్లర్ల జాడ, ఫామ్‌‌హౌస్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్‌‌ పార్టీల లెక్కలు ఇంకా తేలలేదు. బినామీలు, అనుమానిత బ్యాంక్ అకౌంట్లపై రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు రితేశ్‌‌రెడ్డి నోరు విప్పడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను మరో రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని సిట్‌‌ అధికారులు విచారిస్తున్నారు. చంచల్‌‌గూడ జైలు నుంచి శనివారం నిందితులను అధికారులు కస్టడీలోకి తీసుకుని శంషాబాద్‌‌ రూరల్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. ప్రధానంగా డ్రగ్స్‌‌ సప్లయర్లతో రోహిత్‌‌రెడ్డి నిర్వహించిన లావాదేవీల గురించి సిట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు రితేశ్‌‌రెడ్డి సహా ఢిల్లీకి చెందిన నమిత్‌‌ శర్మను ఇప్పటికే మూడుసార్లు.. ఎనిమిది రోజులపాటు సిట్‌‌ కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. 

ప్రముఖులతో ఫొటోలు దిగినట్లు రోహిత్‌‌రెడ్డికి చూపిన నమిత్ శర్మ..

రోహిత్​రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పనుంచి రాజకీయ, వ్యాపార వ్యవహారాలను ఆయన సోదరుడు రితేశ్‌‌ రెడ్డి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజస్తాన్‌‌కు చెందిన నమిత్ శర్మ ఢిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తూ నాలుగు నెలల క్రితమే రోహిత్‌‌ రెడ్డికి పరిచయమైనట్లు తెలిసింది. ఢిల్లీలో ప్రముఖులతో ఫొటోలు దిగినట్లు చూపి రోహిత్‌‌ రెడ్డితో నమిత్​శర్మ పరిచయం పెంచుకున్నాడు. కాగా, ఫామ్‌‌హౌస్‌‌ కేంద్రంగా ప్రతినెలా కనీసం రెండు వీకెండ్ పార్టీలు జరుగుతున్నాయని, వీటిని రితేశ్‌‌రెడ్డి పర్యవేక్షిస్తున్నట్లు సిట్‌‌ దర్యాప్తులో బయటపడింది. 

ఇందులో భాగంగానే గత నెల 14న జరిగిన పార్టీలో నమిత్‌‌ శర్మ కూడా పాల్గొన్నట్లు సిట్‌‌ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే రోహిత్‌‌ రెడ్డి, రితేశ్‌‌రెడ్డి సహా నమిత్ శర్మకు పెడ్లర్లతో లింకైన మరో మూడు అనుమానిత బ్యాంక్‌‌ అకౌంట్లను సిట్‌‌ సేకరించింది. వీటిలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. ఇందులో డ్రగ్స్‌‌ కొనుగోళ్లకు సంబంధించినదే కాకుండా ఇతర లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. కాగా, వీటిలో డ్రగ్స్ లెక్కలు తేల్చడం సిట్‌‌కు సవాల్​గా మారినట్లు సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.