
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఉద్యోగాలకు భూమి’ అవినీతి ఆరోపణల కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ శనివారం లాలూ ప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 13న ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. అంతకుముందు, తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్లను కొట్టివేయాలన్న లాలూ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రవీందర్ దత్ దేజా తిరస్కరించారు. ఈ కేసులో దాఖలైన మూడు ఛార్జిషీట్లను కూడా కోర్టు సమర్థించింది.
కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. జబల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్‌లో, బహుమతిగా ఇచ్చిన లేదా బదిలీ చేసిన భూమికి బదులుగా “గ్రూప్ డి” రైల్వే ఉద్యోగాలను కేటాయించారని అధికారులు ఆరోపిస్తున్నారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సీబీఐ ముందస్తు అనుమతి పొందనందున, ఎఫ్ఐఆర్, దర్యాప్తు, ఛార్జిషీట్లు చట్టపరంగా లోపభూయిష్టంగా ఉన్నాయని, అందువల్ల ఈ విచారణ చెల్లదని లాలూ వాదించారు.