Reading Time: < 1 minute

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నం: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Caption of Image.
  • ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేతో దేశానికి రోల్​ మోడలయ్యాం

నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలన సామాజిక న్యాయానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటోందని టీపీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా నలిగిన ఎస్సీ వర్గీకరణను అమలు చేయడమే కాకుండా, కుల సర్వేతో జనాభా లెక్కలు తీసి సంక్షేమ స్కీమ్​లు అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆదివారం నిజామాబాద్​లోని చంద్రశేఖర్​నగర్​ కాలనీ చౌరస్తాలో అన్నాభావు సాఠే విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోని అన్ని కులాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలనే రాహుల్​గాంధీ సంకల్పం నేరవేరేలా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లతో పేద కుటుంబాలకు తమ సర్కార్​ అండగా ఉంటోందన్నారు.

మహిళకు ఉచిత బస్  ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​ అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి తరువాత అభివృద్ధిపై అన్ని పార్టీలు ఫోకస్​ పెట్టాలని సూచించారు. అన్నాభావు సాఠే పేదలు, అణగారినవర్గాల పరిస్థితిని తన రచనలతో ప్రతిబింబించారని తెలిపారు. సామాజిక అసమానతలు, అన్యాయాలపై ఆయన కలంతో చేసిన పోరాటాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

దళితులు అన్నింటాఎదగాలి: మంత్రి అడ్లూరి
దళిత సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగితేనే సామాజిక మార్పు సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ పేర్కొన్నారు. మాదిగ వర్గం నుంచి గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అభివృద్ధిలో ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. అన్నాభావుసాఠే నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్​ అలీ, మేయర్  ఉమారాణి, డీసీసీ ప్రెసిడెంట్​ నగేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, డి.రాజేశ్వర్, నరాల రత్నాకర్​ ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.