
టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘గయ్యాళి అత్త’ అంటే గుర్తొచ్చే పేరు సూర్యకాంతం. తెరపై ఆమె చూపించే ప్రతాపం చూసి నిజ జీవితంలోనూ ఆమె అలాగే ఉంటారని చాలామంది భయపడేవారు. కానీ, ఆమె వ్యక్తిత్వం వెన్నలాంటిదని, ముఖ్యంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆమెకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సూర్యకాంతం తన అద్భుత నటనతో గయ్యాళి అత్త పాత్రలకు ప్రాణం పోశారు. ఆ పాత్రల ప్రభావం ఎంతగా ఉండేదంటే, ఇప్పటికీ తమ పిల్లలకు ‘సూర్యకాంతం’ అని పేరు పెట్టడానికి భయపడే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, నిజ జీవితంలో ఆమె ఎంతో సౌమ్యురాలు. తన ఇంటికి వచ్చే అభిమానులకు కడుపు నిండా అన్నం పెట్టే గుణం ఆమెది. భాషలపై మక్కువతో మరాఠీ, ఫ్రెంచ్ వంటి భాషలను కూడా నేర్చుకున్న విజ్ఞాని ఆమె. షూటింగ్ సెట్‌కు పెద్ద క్యారియర్లలో రకరకాల పిండివంటలు తెచ్చి, అందరికీ కొసరి కొసరి వడ్డించే అలవాటు ఆమెకు ఉండేది. సూర్యకాంతం ఆస్పత్రిలో ఉన్నప్పుడు, చనిపోయిన రోజు పలువురు సినీ ప్రముఖులు వెళ్లలేదని విమర్శలు కూడా ఉన్నాయి.
ఇది చదవండి: SPB నన్ను చూసి భయపడేవాడు.! అది ఆయన ఫీలింగ్.. కానీ అవకాశాలు రాకపోవడానికి కారణం..
1994లో సూర్యకాంతం మరణించినప్పుడు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో విదేశీ పెట్టుబడిదారులతో కీలకమైన సమావేశంలో ఉన్న జయలలిత, సూర్యకాంతం మరణవార్త వినగానే చలించిపోయారు. మీటింగ్‌ను మధ్యలోనే ఆపి, పరుగు పరుగున సూర్యకాంతం ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఎప్పుడూ భావోద్వేగాలను బయటపెట్టని జయలలిత, సూర్యకాంతం పార్థివదేహం ముందు కన్నీరు పెట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. “సూర్యకాంతం కేవలం నటి మాత్రమే కాదు, నా ఆకలి తీర్చిన అమ్మ” అని జయలలిత గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో సూర్యకాంతం తెచ్చే పులిహోర, మసాలా వడలు అంటే జయలలితకు ఎంతో ఇష్టమట. వేరే ఫ్లోర్‌లో షూటింగ్ ఉన్నా సరే, భోజన సమయానికి సూర్యకాంతం దగ్గరికే వెళ్లేవారట. ఆ మాతృప్రేమ వల్లే ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి మరీ ఆమె చివరి చూపు కోసం జయలలిత వెళ్లారు. సూర్యకాంతం నటన ఎంత సహజంగా ఉండేదో చెప్పడానికి ఒక ఉదాహరణ.. ఒకసారి ఆమె ఇంటికి వంట పని కోసం వచ్చిన ఒక మహిళ, యజమాని సూర్యకాంతం అని తెలియగానే భయంతో లగేజీ సర్దుకుని పారిపోయిందట. ఇది ఆమె నటనకు దక్కిన గొప్ప గౌరవం. తెరపై భయపెట్టిన ఆమె, మనసుతో అందరినీ గెలుచుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని సైతం కదిలించిన ఆమె మంచితనం మరువలేనిది.
ఇది చదవండి: మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే.. అప్పుడే చెప్పిన గొల్లపూడి