
వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో తొలి స్లీపర్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించగా.. రెండో రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రెండో వందే భారత్ స్లీపర్ రైలుపై కీలక ప్రకటన వచ్చేసింది. తొలి రైలుకు ప్రయాణికుల నుంచి అద్బుత స్పందన రావడం, ఆక్సుపెన్సీ పెరుగుతున్న క్రమంలో రెండో రైలును కూడా ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. రెండో వందే భారత్ స్లీపర్ రైలుకు తాజాగా ఆమోదం లబించింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
ఈ ప్రాంతాల మధ్య సర్వీసులు
రెండో వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు-ముంబై మధ్య తిప్పాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నెల 5న బెంగళూరు సెంట్రల్ ఎంపీ మోహన్‌కు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లేఖ రాశారు. ఈ లేఖలో విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఎక్కడెక్కడ ఇది ఆగుతుంది.. టైమ్ షెడ్యూల్స్ ఏంటి.. ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. కేవలం ఏ ప్రాంతాల మధ్య తిరుగుతుందనేది మాత్రం స్పష్టత వచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఇక టికెట్ ధరలను కూడా త్వరలో ప్రకటించేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. దూరపు ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణానికి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రాకతో 16 గంటలకు సమయం తగ్గనుంది.
రైలు ప్రత్యేకతలు
కాగా తొలి రైలును జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గువహతి వరకు ఇది సర్వీసులు అందిస్తోంది. దీని వేగం గంటకు 180 కిలోమీటర్లు కాగా.. మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో మొత్తం ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఇక సీసీటీవీ కెమెరాలు, మెరుగైన కుషనింగ్, అత్యాధునిక టాయిలెట్లు, సౌండ్ సిస్టమ్ వంటివి ఉంటాయి. విమానం తరహాలో ఇందులో సౌకర్యాలు ఉంటాయి. కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభం అవుతుండగా.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులను అనుమతించరు. ఇక ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా పర్మిషన్ ఉండదు. కేవలం కన్పార్మ్‌డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక టికెట్‌తో పాటు ఉచితంగా ఫుడ్ అందిస్తారు. దీంతో పుడ్ ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో రైలు కూడా ఇదే ఫీచర్లతో ఉండనుంది.
New Vande Bharat Sleeper train between Bengaluru and Mumbai approved. pic.twitter.com/dB1NIcndYF
— P C Mohan (@PCMohanMP) April 11, 2026