Reading Time: < 1 minute

హైదరాబాద్: మైనింగ్ నుంచి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా కీలకం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తీర్మానాలను ఏకపక్షంగా పాస్ చేయడం సరికాదు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మైనింగ్ శాఖపై హరీశ్ రావు మాట్లాడారు. తాను ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతానని తెలియజేశారు. మైనింగ్ శాఖలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. తన మాటలను రాజకీయాలు, విమర్శలుగా తీసుకోవద్దు అని సూచించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయినీ కాపాడే బాధ్యత మనదేనని, ఖనిజాలపై ఆదాయం ఏటా పెరుగుతోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే జివొ 111 ను ఉల్లంఘిస్తున్నారని, స్టోన్ క్రషర్లకు నిబంధనలు కూడా మీ ప్రభుత్వమే పెట్టిందని మండిపడ్డారు. మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలని, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. స్టోన్ క్రషర్ కు పిసిబి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి అని.. స్టోన్ క్రషర్ యజమాని.. మైనింగ్ అధికారికి ప్రతి నెలా వివరాలు ఇవ్వాలని సూచించారు. డీజిల్ జనరేటర్లతో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.