Reading Time: < 1 minute

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. మరికొంతమంది సినీ నటీనటులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా డైరెక్టర్ సుందర్ సి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన అన్నాడిఎంకె కూటమిలోని పుతియ నీతి కట్చి(పిఎన్ కె) పార్టీ తరుఫున సుందర్‌.. మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఏ.సి. షణ్ముగం శనివారం ప్రకటించారు. DMK కీలక నేత, మంత్రి పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్‌తో సుందర్ తలపడే అవకాశం ఉంది.

డైరెక్టర్ సుందర్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన భార్య, సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఆయన జీవిత భాగస్వామిగా, నేను ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నాను. గత 30 ఏళ్లుగా తమిళనాడు ప్రజలను అలరిస్తూ వస్తున్న ఆయన, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజల కోసం తన అత్యుత్తమ సేవలను అందిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను” అంటూ ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.