Reading Time: < 1 minute

పాకిస్తాన్లో చుక్కలు చూపిస్తున్న LPG గ్యాస్ ధరలు.. 11.67 కేజీల సిలిండర్ రేటు ఎంతంటే..

Caption of Image.

కరాచీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పాకిస్తాన్లో నిన్నమొన్నటివరకూ 3 వేల 150 నుంచి 3 వేల 968 రూపాయల మధ్య ఉన్న 11.67 కేజీల ఎల్పీజీ సిలిండర్ సగటు ధర ప్రస్తుతం 3 వేల 900 నుంచి 5 వేల 135 రూపాయల దాకా అమ్ముతున్నారు. మార్చి 26తో ముగిసిన వారానికి సంబంధించిన సెన్సిటివ్ ప్రైస్ ఇండెక్స్ (SPI) డేటా ప్రకారం.. పాకిస్తాన్లోని పంజాబ్‌ ప్రావిన్స్లో ఉన్న పలు నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఈ ప్రభావంతో ఎల్పీజీతో నడుస్తున్న ప్రైవేట్ వాహనాలు రవాణా ఛార్జీలను అమాంతం పెంచేశాయి. నిన్నమొన్నటి వరకూ 20 రూపాయలు తీసుకున్న దగ్గర ఇప్పుడు 40 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితున్నాయి. ఎల్పీజీ రిక్షాలు, బస్సులు, మినీ బస్సులలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఈ పెరిగిన ఛార్జీలు తలకు మించిన భారంగా మారాయి.

►ALSO READ | ఇరాన్ కు మద్దతుగా యమన్ హౌతీలు వచ్చేశారు : ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు మొదలెట్టేశారు..!

అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో పాటు ప్రపంచ మార్కెట్లో LPG గ్యాస్ ధరలు పెరగడం.. వీటికి తోడు ఈద్, నౌరోజ్ సెలవుల కారణంగా.. ఇరాన్ నుంచి పాకిస్తాన్కు వచ్చే గ్యాస్ సప్లై కూడా మందగించింది. ఈ యుద్ధానికి ముందు పాకిస్తాన్కు ఇరాన్ నుంచి రోజుకు 10,000-12,000 టన్నుల మధ్య LPG గ్యాస్ సప్లై జరిగేది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే.. పట్టుమని పదిహేను రోజులకు సరిపడా LPG గ్యాస్ నిల్వలు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నాయి.

సెలవుల తర్వాత ఇరాన్ సరిహద్దుల నుంచి గ్యాస్ రాక మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని.. అప్పుడు డిమాండ్కు తగిన సప్లై ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధి ఎం.అలీ హైదర్ తెలిపారు. పాకిస్తాన్కు సంవత్సరానికి 2 మిలియన్ టన్నులు ఎల్పీజీ అవసరం పడుతుంది. అందులో 1.2 మిలియన్ టన్నులు ఎల్పీజీని పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటుండగా.. 8 లక్షల టన్నుల ఎల్పీజీని పాకిస్తాన్లోని రిఫైనరీలు ఉత్పత్తి చేస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.