
చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి భార్యపై ప్రియురాలు దాడికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన యువతి.. ఏకంగా ప్రియుడి భార్యపై దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం బోయపల్లి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తవణంపల్లి మండలం
బోయపల్లి గ్రామానికి చెందిన దిలీప్, రోజా దంపతులు నివసిస్తున్నారు. అయితే.. అదే గ్రామానికి చెందిన భాను అనే మహిళతో దిలీప్ కు పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది. గత ఐదేళ్లుగా రోజా భర్త దిలీప్, భాను మధ్య వివాహేత సంబంధం కొనసాగుతోంది.. అయితే.. భాను – దిలీప్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ను గుర్తించిన రోజా.. భర్తను నిలదీసింది. ఇదూ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు కొనసాగుతున్నాయి.. అయితే.. కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలతో ప్రియురాలు భానును కొద్ది రోజులుగా దిలీప్ దూరం పెట్టాడు. దీంతో ప్రియుడు తనకు కాకుండా పోతాడని భావించిన భాను రోజాపై కక్ష్య పెంచుకుంది. రోజా ఇంట్లో ఒక్కతే ఉన్నట్లు గుర్తించిన భాను స్కెచ్ వేసింది. రోజాను అంతమొందించాలని ప్లాన్ చేసింది. ఇంట్లో నిద్రిస్తున్న రోజాపై స్నేహితురాలు తులసితో కలిసి దాడి చేసింది.
రోజా నోటిలో గుడ్డ కుక్కి బండరాయితో తలపై మోదీ భాను హతమార్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో.. ఇంట్లో నుంచి రోజా అరుపులు, కేకలు విన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. వారు వచ్చే లోపు.. భాను, తులసి అక్కడినుంచి పరారయ్యారు.. తీవ్రగాయాలైన రోజాను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి తరలించారు బంధువులు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. భాను, తులసి పై కేసు నమోదు చేసి.. వారిని అరెస్టు చేశారు. కాగా.. రోజాపై దాడి చేసిన భాను, తులసిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..