Reading Time: 2 minutes

బంగారం అమ్మటం మొదలుపెట్టిన రష్యా: 25 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు ఇలా..!

Caption of Image.

రష్యా ఆర్థిక వ్యవస్థలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా.. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తన రిజర్వుల్లోని ఫిజికల్ గోల్డ్ అమ్మేయటం స్టార్ట్ చేసిందనే రిపోర్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం 4వ ఏటలోకి అడుగుపెట్టిన వేళ.. విపరీతంగా పెరుగుతున్న సైనిక ఖర్చులు, బడ్జెట్ లోటును భర్తీ చేసుకునేందుకు వేరే దారి లేక క్రెమ్లిన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు అంటున్నారు. 2026 మొదటి రెండు నెలల్లోనే రష్యా సుమారు 35 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.3లక్షల 15వేల కోట్లు విలువైన గోల్డ్ రిజర్వ్స్ అమ్మేసిందని తాజా రిపోర్ట్స్ ప్రకారం తేలింది. ఈ క్రమంలో రష్యా జనవరిలో 3లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2లక్షల ఔన్సులో గోల్డ్ అమ్మేసిందట. 

బంగారం అమ్మకానికి కారణాలేంటి?
రష్యా తన వద్ద ఉన్న బంగారాన్ని ఇప్పుడే అమ్మటానికి ప్రధాన కారణం ఆ దేశంలో పెరుగుతున్న బడ్జెట్ లోటు. 2025 చివరి నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరుకుంది. ఇది అంచనా వేసిన 0.5 శాతం కంటే చాలా ఎక్కువ. అందుకే యుద్ధం కోసం చేస్తున్న భారీ వ్యయం ఒకవైపు, పడిపోతున్న క్రూడ్ రేట్లు.. పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షల వల్ల తగ్గుతున్న ఆదాయం మరోవైపు రష్యాను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. మునుపటితో పోలిస్తే క్రూడ్ అండ్ గ్యాస్ నుంచి వచ్చే పన్ను ఆదాయం సగానికి పడిపోయింది. ఈ లోటును పూడ్చుకోవడానికి రష్యా తన వద్ద ఉన్న లిక్విడ్ రిజర్వ్స్ అయిన గోల్డ్ బయటకు తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

గతంలో రష్యా తన బంగారానికి సంబంధించిన లావాదేవీలను కేవలం ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్స్ కోసమే పరిమితం చేసేది. కానీ ఇప్పుడు నేరుగా మార్కెట్లోకి ఫిజికల్ గోల్డ్‌ను విడుదల చేస్తోందట. జనవరి, ఫిబ్రవరిలో గోల్డ్ అమ్మకాల వల్ల రష్యా బంగారు నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అతి తక్కువ స్థాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు 5వేల డాలర్లు దాటి రికార్డు స్థాయిలో ఉండటం రష్యాకు కలిసి వచ్చింది. రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడే అమ్ముకుని లాభాలు చేసుకోవాలని ప్రస్తుతం రష్యా భావిస్తోంది.

ALSO READ : ఏప్రిల్ 1 నుంచి ఆయిల్ ఎగుమతులపై రష్యా బ్యాన్

ప్రపంచంలోనే 5వ అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన దేశంగా రష్యాకు 2వేల టన్నులకు పైగా బంగారం ఉంది. డాలర్‌పై ఆధారపడటం తగ్గించడానికి 2014 నుంచే రష్యా క్రమంగా బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు యుద్ధ సంక్షోభంలో ఆ బంగారమే దానికి అండగా నిలుస్తోంది. బంగారంతో పాటు నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా కూడా నిధులను సేకరిస్తోంది రష్యా. అలాగే దేశీయ బాండ్ల జారీని పెంచడం, వ్యాట్ పన్నులను పెంచడం ద్వారా యుద్ధానికి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటోంది పుతిన్ ప్రభుత్వం.
 

©️ VIL Media Pvt Ltd.