Reading Time: 2 minutes
Pm E Drive Scheme Updated New Deadlines Ev Subsidies India

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ-డ్రైవ్’ (PM E-DRIVE) పథకంలో తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ పథకం ద్వారా లభించే రాయితీలు, గడువు తేదీలు.. ఇతర నిబంధనలను సవరిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

ఈ పథకం మొత్తం రూ.10,900 కోట్ల బడ్జెట్‌తో నడుస్తోంది. ఇది నిధులతో ముడిపడి ఉన్న ప్రోగ్రామ్. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు పథకం ముగింపు తేదీ కంటే ముందే అయిపోతే.. అప్పటికప్పుడు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎటువంటి రాయితీ దరఖాస్తులను స్వీకరించరు. మునుపటి నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ టూవీలర్లకు రాయితీ పొందే గడువు మార్చి 31, 2026 వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దీనిని జూలై 31, 2026 వరకు పొడిగించారు. అంటే ఈ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (ఈ-రిక్షాలు, ఈ-కార్టులు) విషయానికి వస్తే, వీటికి మునుపటి గడువు తేదీ అయిన మార్చి 31, 2028 వరకు రాయితీలు అందుబాటులో ఉంటాయి.

ధరల పరిమితి..

అన్ని వాహనాలకు ఈ రాయితీ వర్తించదు. వాహనం కంపెనీ ధర ఆధారంగా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఎలక్ట్రిక్ టూవీలర్ల విషయానికి వస్తే.. వీటి ధర రూ.1.5 లక్షల లోపు ఉంటేనే రాయితీకి అర్హత ఉంటుంది. ఈ-రిక్షాల విషయానికి వస్తే.. వీటి ధర రూ.2.5 లక్షల లోపు ఉండాలి.

Also Read:Gas Cylinder Robbery: గ్యాస్‌ సిలిండర్లతో డెలివరీ బాయ్‌ పరార్..

వాహనాల సంఖ్యపై పరిమితి..

ప్రభుత్వం రాయితీ ఇచ్చే వాహనాల సంఖ్యను కూడా ఖరారు చేసింది. ఈ పథకం కింద గరిష్టంగా 24,79,120 ఎలక్ట్రిక్ టూవీలర్లకు మాత్రమే మద్దతు లభిస్తుంది. ఈ-రిక్షాల సంఖ్యను 39,034 యూనిట్లకు పరిమితం చేశారు. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల (L5 విభాగం) లక్ష్యం అప్పటికే పూర్తయినందున.. వీటికి సంబంధించిన రాయితీలను డిసెంబర్ 26, 2025 నుంచే నిలిపివేశారు.

రాయితీ ఎంత ఉంటుంది..?

వాహనం బ్యాటరీ సామర్థ్యం (kWh) ఆధారంగా ఇచ్చే రాయితీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట మొత్తం లేదా వాహనం ధరలో గరిష్టంగా 15 శాతం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానినే రాయితీగా ఇస్తారు. పర్యావరణాన్ని కాపాడుతూ.. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ పథకం గొప్ప అవకాశం. అయితే నిధులు, వాహనాల సంఖ్యపై పరిమితి ఉన్నందున.. ముందుగా కొనుగోలు చేసిన వారికే ఈ ప్రయోజనం చేకూరుతుంది.