Reading Time: < 1 minute

అణ్వాయుధాల తయారీపై ఇరాన్ ప్రతినిధి ప్రకటన.. యుద్ధాన్ని భారత్ ఆపగలదంటూ కామెంట్స్

Caption of Image.

ఇరాన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న వేళ భారత పర్యటనలో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజిద్ హకీమ్ ఇలాహీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ వైపు వెళ్తోందన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ సిద్ధాంతంలో అణ్వాయుధాలకు చోటు లేదని, తమ సుప్రీం లీడర్ ఇప్పటికే దీనిపై ఫత్వా జారీ చేశారని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను కలిగి ఉండటం హరామ్ అంటే నిషిద్ధమని వెల్లడించారు. తమ దేశానికి అలాంటి ఉద్దేశ్యం లేదని పేర్కొన్నారు. 

ఈ యుద్ధాన్ని ముగించడంలో భారత్ పోషించాల్సిన పాత్రపై ఇలాహీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, ఇరాన్ దేశాల మధ్య 5వేల ఏళ్ల నాటి అనుబంధం ఉందని.. సంస్కృతి, తత్వశాస్త్రం పరంగా రెండు దేశాలు పెనవేసుకుపోయాయని గుర్తు చేశారు. భారత్ న్యాయానికి, స్వేచ్ఛకు పెట్టింది పేరని కొనియాడారు. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని ముగించడంలో భారతదేశం అత్యంత కీలకమైన.. సానుకూల పాత్రను పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి స్థాపనలో భారత్ జోక్యం ఇరు దేశాలకు, ప్రపంచానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ALSO READ : ఇరాన్ కు మద్దతుగా యమన్ హౌతీలు వచ్చేశారు

అదే సమయంలో పాకిస్థాన్ చేస్తున్న వాదనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాక్ చెప్పుకుంటున్న దానిలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. 15 అంశాల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో తాము ఎటువంటి చర్చలు జరపడం లేదని. తమ రాయబారి కూడా ఈ విషయాన్ని ఖండించారని ఇలాహీ క్లారిటీ ఇచ్చారు. యుద్ధం ముగియడం అనేది దానిని ప్రారంభించిన దేశాల చేతుల్లోనే ఉందని, ఆయుధాల విక్రయాలు, చమురు ధరల పెరుగుదల ద్వారా లాభం పొందాలని చూసే వారు యుద్ధం ఆపడానికి ఇష్టపడటం లేదంటూ అమెరికా తీరుపై విమర్శించారు.

©️ VIL Media Pvt Ltd.