Reading Time: 2 minutes
Donald Trump Shocking Remarks On Failure Leadership And Iran Conflict Spark Debate

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి ఎప్పుడూ విచిత్రంగా ఉంటుంది. ఏం చేసినా భిన్నంగా ఉండాలని అనుకుంటారో ఏమో తెలియదు గానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి.

విజయవంతమైన అబ్బాయిలంటే తనకు ద్వేషం అని.. ఓడిపోయిన వాళ్లతో తిరగడమే తనకు ఇష్టం అని వ్యాఖ్యానించారు. మయామిలోని ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్‌లో ట్రంప్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ‘‘సెక్స్’’, ‘‘మీకు నచ్చిన ఏ విషయం గురించైనా’’ స్వేచ్ఛగా ప్రశ్నలు అడగాలని కోరారు. దీంతో ట్రంప్‌కు అనేక ప్రశ్నలు సంధించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ నాయకత్వ లక్షణం కొరవడిందని ప్రశ్న రాగానే ‘‘గెలవడమే’’ అత్యంత ముఖ్యమైన అంశం అని ట్రంప్ బదులిచ్చారు. జీవితంలోని ఇతర రంగాల్లో కాకుండా.. క్రీడా ఫలితాల్లో స్పష్టంగా.. తక్షణమే ఉంటాయని.. దీంతో క్రీడలను ఉదాహరణగా తీసుకుని.. విజయం, అపజయాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు.

విజయవంతమైన వ్యక్తులు తమ విజయాల గురించి మాట్లాడటం.. వినడం తనకు ఇష్టం ఉండదని.. విఫలమైన వారితో తిరగడానికి ఇష్టపడతానని చెప్పారు. ఎందుకంటే అది తనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇక తన విజయాన్ని వినడానికి ఇష్టపడే వ్యక్తులంటే మాత్రం ఇష్టమని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా 2020లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీని గుర్తుచేశారు. సులేమానీ గొప్ప నాయకుడు.. పిచ్చి మేధావి అని అభివర్ణించారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కూడా మరణించారని పేర్కొన్నారు. ఇటీవలి అమెరికా జరిపిన సైనిక చర్యలతో ఇరాన్ నాయకత్వాన్ని సమర్థవంతంగా కూల్చివేశాయన్నారు. అంతేకాకుండా ఇరాన్ నౌకాదళం కూడా నాశనమైపోయిందని.. అలాగే వారి వైమానిక దళం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిందని పేర్కొన్నారు. క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ ఫ్యాక్టరీలు, రక్షణ మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు.

ఇరాన్ ఇప్పుడు చర్చలు కోరుకుంటోందని.. ఒప్పందం కోసం వేడుకుంటున్నారని తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్ సమీక్షిస్తోందన్నారు.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ యుద్ధంలో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీతో పాటు భద్రతా అధిపతి అలీ లారిజానీతో సహా పలువురు ఉన్నతాధికారులు హత్యకు గురయ్యారు. ఇరాన్ అధికారుల ప్రకారం.. 175 మంది పాఠశాల బాలికలతో సహా కనీసం 1,900 మంది మరణించారు.. 32 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.