
మనం ఎప్పుడూ వినే మాట నీళ్లు ఎక్కువగా తాగండి, ఆరోగ్యంగా ఉండండి అని… కానీ ఏ పనైనా అతిగా చేస్తే ప్రమాదమే. నీళ్ల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం….
చాలామంది రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలని కచ్చితంగా కండిషన్ పెట్టుకుంటారు. కానీ అది అందరికీ సెట్ అవ్వదు. మీ కిడ్నీల సామర్థ్యం బట్టి మీరు ఎన్ని నీళ్లు తాగాలో ఆధారపడి ఉంటుంది. కొందరికి 4 గ్లాసులు సరిపోవచ్చు, మరికొందరికి ఇంకా తక్కువ అవసరం కావచ్చు. మన శరీరమే ఒక మిషన్ లాంటిది, అది ఎప్పటికప్పుడు కిడ్నీల ద్వారా నీటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది.
మీ శరీరం తట్టుకోలేనంత నీటిని ఒకేసారి తాగినప్పుడు ‘హైపోనాట్రేమియా’ అనే పరిస్థితి వస్తుంది. అంటే రక్తంలో ఉండాల్సిన ఉప్పు (సోడియం) పల్చబడిపోతుంది. దీనివల్ల తల తిరగడం, వాంతులు రావడం, మెదడుపై ప్రభావం పడి గందరగోళంగా అనిపించడం, మూర్ఛ రావడం లేదా స్పృహ తప్పడం జరగవచ్చు.
కిడ్నీలు దెబ్బతిన్నవారు జాగ్రత్త!
కిడ్నీ సమస్యలు ఉన్నవారు నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు, అవి అదనపు నీటిని బయటకు పంపలేవు. ఇలాంటి వారు డాక్టర్ సలహా మేరకే నీళ్లు తాగాలి.
ఎక్కువ నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి అనేది అపోహ.. నిజం ఏంటంటే.. నీళ్లు తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి కానీ, ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీలు నీళ్ల వల్ల మళ్లీ బాగుపడవు.
ALSO READ : డయాబెటిస్ ఉన్నవారు.. ఏమి తినాలి.. ఏమి తినకూడదు..
ఎంత తాగితే మంచిది
ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 2 నుండి 3 లీటర్ల ద్రవ పదార్థాలు నీళ్లు, మజ్జిగ, జ్యూస్ కలిపి సరిపోతాయి. ముఖ్యమైన విషయం మీకు దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగండి. ఎండలో తిరిగినా లేదా వ్యాయామం చేసినా కొంచెం ఎక్కువ తాగొచ్చు. ఒకేసారి లీటర్ల కొద్దీ తాగకుండా, విడతల వారీగా తాగడం మంచిది. నీరు ప్రాణాధారం, కానీ ఔషధంలా పని చేయాలి అంటే పరిమితిలో ఉండాలి. మీ శరీరం ఇచ్చే సిగ్నల్స్ గమనించి నీళ్లు తాగడమే అత్యుత్తమ మార్గం.