ఆచార్య చాణక్యుడు భారతదేశ చరిత్రలో ప్రముఖ తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు, రాజకీయ మేధావి. ఆయన బోధనలు కేవలం పురాతన కాలానికే పరిమితం కాకుండా.. నేటి జీవితానికి కూడా ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి. ముఖ్యంగా యువత తమ లక్ష్యాలను సాధించేందుకు ఆయన సూచనలు మార్గదర్శకంగా నిలుస్తాయి. వ్యక్తి ఎదుగుదల, విజయానికి అవసరమైన మనస్తత్వం, క్రమశిక్షణ, ధైర్యం వంటి అంశాలను ఆయన స్పష్టంగా వివరించారు.
జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కోరిక సరిపోదు; ఆ కోరికను కార్యరూపంలో పెట్టే ధైర్యం, పట్టుదల అవసరం. ప్రతి రోజూ మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాలి. సవాళ్లను చూసి వెనక్కి తగ్గితే ఎదుగుదల ఆగిపోతుంది. ముఖ్యంగా, అవసరమైన చోట సిగ్గు పడటం మన ప్రగతికి అడ్డంకిగా మారుతుంది. చాణక్యుని బోధనల ప్రకారం, కొన్ని విషయాల్లో సిగ్గు అసలు ఉండకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డబ్బు విషయాల్లో సంకోచం వద్దు..
ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత, ధైర్యం చాలా ముఖ్యం. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే, దాన్ని తిరిగి అడగడంలో ఎలాంటి మొహమాటం అవసరం లేదు. అలాగే, నిజంగా అవసరం ఉన్నప్పుడు సహాయం కోరడంలో తప్పేమీ లేదు. కానీ తీసుకున్నది తిరిగి చెల్లించే బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలి.
2. తినే విషయంలో మొహమాటం వద్దు..
ఆకలి ఒక సహజ అవసరం. ఇతరుల ఇళ్లలో లేదా బయట తినేటప్పుడు “ఎవరేమనుకుంటారు?” అని వెనుకడుగు వేయడం మంచిది కాదు. సరైన ఆహారం తీసుకోకపోతే శరీరం, మనసు రెండూ బలహీనపడతాయి. అందువల్ల, అవసరమైనప్పుడు నిర్భయంగా తినాలి.
3. జ్ఞానం పొందడంలో సిగ్గు వద్దు..
విద్య ఎక్కడ నుంచైనా పొందాలి.. అది చిన్నవారి దగ్గరైనా, గురువుల దగ్గరైనా. సందేహాలు ఉన్నప్పుడు అడగడానికి సంకోచించకూడదు. ప్రశ్నలు అడిగే ధైర్యం ఉన్నవారే నిజంగా ముందుకు సాగుతారు.
4. అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో వెనుకడుగు వద్దు..
సరైనది.. తప్పు తెలుసుకుని కూడా చెప్పకుండా ఉండటం మంచిది కాదు. మీకు నచ్చని విషయాలపై స్పష్టంగా “లేదు” అని చెప్పగలగాలి. కార్యాలయం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాల్లో మీ అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచాలి. మొత్తానికి, అవసరమైన సందర్భాల్లో సిగ్గు/భయం మన అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది. సరైన చోట ధైర్యంగా ముందుకు రావడం నేర్చుకుంటేనే జీవితంలో విజయాన్ని సాధించగలం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)





