
శ్రీరామనవమి రోజు.. అందరూ రాములోరి కళ్యాణంలో ఉండగా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ రాముడు.. తమ కొడుకు పెళ్లి చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా లేకపోయినా విగ్రహాలను ఏర్పాటు చేసి.. అతడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసి వారి తీరని కోరికను తీర్చారు. గత 23 ఏళ్లుగా చనిపోయిన కొడుకుకు పెళ్లి జరుపుతున్నారు ఆ తల్లిదండ్రులు. మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం (మార్చి 27) జరిగిన ఈ పెళ్లి వేడుక అందరి హృదయాలను కరిగించి వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో ప్రేమికుల విగ్రహాలకు పెండ్లి చేశారు కుంటుంబ సభ్యులు. 23 సంవత్సరాల కిందట రామ్ కోటి, మరో అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెండ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రామ్ కోటి. ప్రేమికుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న ప్రేమికురాలు 20 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కొడుకుపై మమకారంతో రామ్ కోటి తల్లిదండ్రులు లాలూ, సుకమ్మ దంపతులు ఇంట్లో గుడి కట్టించారు. కొడుకు పక్కన అతడు ప్రేమించిన అమ్మాయి విగ్రహాన్ని కూడా కట్టించారు. ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి సందర్బరంగా గుడిలో వున్న విగ్రహాలకు సంప్రదాయ పద్దతిలో పెండ్లి చేస్తూ వస్తున్నారు. ఈ పెండ్లికి బంధువులందరూ హజరువుతంటారు.
భద్రాచలం లో శ్రీ సీతారాముల కల్యాణం లాగే పెండ్లి చేశారు కుంటుంబ సభ్యులు. వేదమంత్రల మధ్య విగ్రహాలకు పెండ్లి చేశారు పూజారి. ప్రేమికుల విగ్రహల పెండ్లి చూడటానికి వచ్చిన బంధువులు.. పెళ్లి చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. తమ కొడుకు జ్ఞాపకాలను తలచుకుంటూ తల్లిందండ్రులు ఈ సందర్భంగా భావోగ్వేదానికి గురయ్యారు.