Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌ ఇవాళ్టి (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అయితే ఈసారి ఎస్‌ఆర్‌హెచ్ తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టుతో జతకట్టినప్పటికీ.. కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. దీంతో ఇషాన్ ఆ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తాడు. ఈ క్రమంలో ఇషాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఐపిఎల్ చరిత్రలోనే అతి చిన్న వయస్సులోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్‌లు జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన వారంతా ఇషాన్ కంటే పెద్ద వారే. ఇవాళ్టికి ఇషాన్ కిషన్ వయస్సు 27 ఏళ్ల 253 రోజులు. సన్‌రైజర్స్ చరిత్రలో ఓవరాల్‌గా రెండో పిన్న వయస్కుడు కావడం గమనార్హం. 2018వ సీజన్‌లో కేన్ విలియమ్‌సన్ 27 ఏళ్ల 244 రోజుల వయస్సులో ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.