
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్ ప్రాంత రైతుల విషయంలో సరిగ్గా అదే జరిగింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కొందరి జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసింది. నిన్నటి వరకు సామాన్య రైతులుగా ఉన్నవారు.. ప్రస్తుతం కోట్ల రూపాయల పరిహారంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ అదృష్టవంతుల జాబితాలోని ఒక రైతు ఏకంగా హెలికాప్టర్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
దాదాపు రూ.15 కోట్ల భారీ పరిహారం అందుకున్న సదరు రైతు.. తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంటూ హెలికాప్టర్ కొనుక్కున్నాడు. కేవలం హెలికాప్టర్ కొనడమే కాదు.. తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్ విహారయాత్రకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఒకప్పుడు పొలంలో ఎండనక, వాననక కష్టపడిన ఆ రైతు చేతికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో.. తన కలలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇది కేవలం ఒక రైతు కథ మాత్రమే కాదు. జేవార్ విమానాశ్రయ పరిసర గ్రామాల్లోని అనేకమంది యువకులు ఇప్పుడు ఫారెన్ ట్రిప్స్ గురించి ప్లాన్ చేసుకుంటూ తమ అదృష్టం తెచ్చిన సంపదతో హ్యాపీగా గడుపుతున్నారు.
ఈ విమానాశ్రయ నిర్మాణం వల్ల శివం ప్రజాపతి అనే మరో యువకుడు లేబర్ సబ్‌కాంట్రాక్టర్‌గా మారి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అతను కూడా తన స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే అజయ్ బెనివాల్ అనే వ్యక్తి కార్మికుల హెల్మెట్లు, తాళాలు భద్రపరిచే చిన్న సర్వీస్ సెంటర్ నడుపుతూ నెలకు రూ.60వేల వరకూ సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు నిరుపేదగా ఉన్న తాము, ఇప్పుడు మంచిగా సంపాదించుకుంటూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నామని వారు చెబుతున్నారు.
►ALSO READ | జ్యోతిష్యుడితో లింకులు.. అను మాలిక్ వివాదం: పదవికి గుడ్ బై చెప్పిన రూపాలి చాకన్కర్ !
అయితే ఈ హఠాత్తుగా వచ్చిన సంపదపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హెలికాప్టర్ అనేది ఒక అధికారానికి చిహ్నం.. రైతు ఆ హోదాను అనుభవించాలనుకోవడంలో తప్పులేదని కొందరు సమర్థిస్తుంటే. మరికొందరు మాత్రం హెచ్చరిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతులు పరిహారం సొమ్ముతో లగ్జరీ కార్లు కొని, చివరికి పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.