
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఐపీఎల్ ప్రసారంపై ఉన్న నిషేధాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారంపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన తెలిపారు.
క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేవలం వాణిజ్య కోణంలోనే పరిశీలిస్తామని తెలిపారు. బంగ్లాలో ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేయాలనుకునే బ్రాడ్‌కాస్టర్స్ అధికారులను సంప్రదించవచ్చని, ఆయా దరఖాస్తులను సానుకూలంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు.
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బంగ్లాలో మెనార్టీలపై దాడులకు నిరసనగా ఐపీఎల్లో ఆ దేశ ప్లేయర్లు ఆడకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే కేకేఆర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై వేటు వేసింది బీసీసీఐ. ఈ చర్యపై అప్పటి యూనస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐపీఎల్లో బంగ్లా ప్లేయర్లపై వేటుకు నిరసనగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది యూనస్ సర్కార్. ఇదిలా ఉండగానే.. 2026, ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగగా తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్ భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై యూనస్ సర్కార్ విధించిన నిషేధాన్ని ఎత్తి వేశారు. దీంతో బంగ్లాలోని క్రికెట్ ఫ్యాన్స్‌తో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో కూడా ఐపీఎల్‌కు భారీ మార్కెట్ ఉంది. ఆ దేశంలో కోట్ల మంది క్రికెట్‌ను ఆరాధిస్తారు.