
సినీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ చిత్రం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు వేదికైంది. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌పై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సినిమాను కేవలం “మూడు గంటల నాన్సెన్స్” అని కొట్టిపారేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
అసలు అది మూవీయేనా?
ఒక మీడియా సదస్సులో ఒవైసీ మాట్లాడుతూ, ఈ చిత్రం సమాజానికి ఇచ్చే సందేశంపై ప్రశ్నలు సంధించారు. అసలు అది ఒక సినిమానా? అంటూ ఎద్దేవా చేశారు. మూడు గంటల పాటు కేవలం బూతులు , మితిమీరిన హింసను చూపించడం తప్ప అందులో విషయం లేదని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యువత ఈ సినిమాను ఆదరిస్తున్నప్పటికీ, తనకు ఇలాంటి పనికిరాని చిత్రాలను చూసే సమయం లేదంటూ మండిపడ్డారు.
ఈ సినిమాలో ముస్లిం పాత్రలను చిత్రీకరించిన విధానంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని కించపరిచేలా లేదా తప్పుగా చూపించే ధోరణి సినిమాల్లో పెరిగిపోతోందని ఆయన పరోక్షంగా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ గురించి ప్రస్తావించగా, తనదైన హైదరాబాదీ యాసలో ఇలాంటి విషయాలను నేను అస్సలు పట్టించుకోను అంటూ తేల్చి చెప్పారు.
Asaduddin Owaisi slams Dhurandhar. 😳
He said, “I don’t watch such movies that promote violence or encourage abuse against Muslims.”
What’s your take on his statement? pic.twitter.com/dIJa3vLnDi
— CineAlpha (@CineAlpha1) March 28, 2026
బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
ఒకవైపు రాజకీయ విమర్శలు వినిపిస్తున్నా, ‘ధురంధర్ 2’ కలెక్షన్ల దూకుడులో మాత్రం తగ్గేదేలే అంటోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1130 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన మొదటి భాగం ‘ధురంధర్’ రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించగా, సీక్వెల్ అంతకు మించిపోయేలా కనిపిస్తోంది.
కథా నేపథ్యం ఏమిటి?
ఈ చిత్రం భారతీయ గూఢచారి జస్కీరత్ సింగ్ రంగీ (హంజా అలీ మజారీ) అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. కరాచీలోని నేర సామ్రాజ్యంలోకి చొరబడి, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఎలా చిన్నాభిన్నం చేశాడనేది ప్రధానాంశం. ఇండియన్ పార్లమెంట్ దాడి, ముంబై దాడులు, ఐసీ-814 హైజాక్ వంటి వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ కథను రూపొందించారు. రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాకు ప్లస్ అయ్యింది.
►ALSO READ | మొన్నటిదాక అక్క అక్క అన్నారు.. ఇప్పుడు ఫోటోల మార్ఫింగ్ చేస్తున్న విజయ్ వారియర్స్!
ఒకవైపు సినిమా మేకింగ్, రణ్‌వీర్ నటనకు ప్రశంసలు దక్కుతుంటే, మరోవైపు సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘ధురంధర్ 2’ చరిత్ర సృష్టిస్తోంది.