
మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో తనను కలిసిన కొండాపూర్ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులతో శ్రీధర్ బాబు బేటీ అయ్యారు. సమావేశంలో టిజిఐఐసి ఎండీ శశాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్కులో మొత్తం 64 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 36 పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. ఇవి ప్రారంభమైతే 5 వేల మంది యువతకు తక్షణం ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
మరో నెల రోజుల్లోగా విద్యుత్ సంబంధిత సమస్యలన్నిటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పార్కును జాతీయ రహదారితో కలిపే అప్రోచ్ రోడ్డును త్వరతిగతిన పూర్తి చేయాలని సూచించారు. సాధ్యమైనంత త్వరలో అన్ని పరిశ్రమలు ఉత్పాదన మొదలు పెట్టేలా మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ పెట్టుబడుల విభాగం డైరెక్టర్ మధుసూదన్, పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు కె.శ్రవణ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం. శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, సంయుక్త కార్యదర్శి ఎ.సాంబశివరావు, ట్రెజరర్ సిహెచ్. అశోక్ కుమార్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ స్వామి, ఎ.వి.రమణ, నవనీత్ జైన్, సంతోష్ కుమార్, కెవిఆర్. సుబ్బారావు పాల్గొన్నారు.