
అమరావతి: ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనేది తమ లక్ష్యమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇల్లు అనేది సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహప్రవేశాలు చేస్తున్నామని, 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని అన్నారు. 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే చరిత్రని కొనియాడారు. ఐదేళ్ల పాలనలో పేదవాళ్ల పొట్ట కొట్టారని, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో ఎక్కడ చూసినా అవినీతి..అధికార దుర్వినియోగం చేశారని, అర్బన్ కింద ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 816 కోట్ల అప్పు పెట్టిందని, రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటైందని తెలియజేశారు. జూన్ నాటికి 2.70 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు, సెప్టెంబర్ నాటికి మరో లక్ష ఇళ్ల గృహప్రవేశాలు చేస్తామని అన్నారు. నివాస యోగం లేని ప్రాంతాల్లో ఇళ్లు కట్టేందుకు వైసిపి ప్రభుత్వం యత్నించిందని, వైసిపి ప్రభుత్వం..పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి కల్పించిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.