
ఎయిర్ పోర్ట్ అంటేనే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అనుమానిత వస్తువులను లోపలికి తీసుకురానివ్వరు. కానీ ఓ ప్రయాణికుడు చేసిన పని ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్కర్ష్ గౌతమ్ అనే గూగుల్ ఉద్యోగి నిబంధనలను గాలికొదిలేసి ఏకంగా ఎయిర్ పోర్ట్ టార్మాక్‌పైనే సిగరెట్ తాగుతూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
మొదట రన్ వేపై సిగరెట్ తాగుతూ కనిపించాడు. తర్వాత విమానాలు నిలిపి ఉంచే చోట, ఇంధనం నింపే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో అతను సిగరేట్ తాగుతూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు వద్దని వారించిన సిబ్బంది పట్ల ఎదురు ప్రశ్నలు వేస్తూ అతను ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిస్తోంది.
ఎయిర్ పోర్టులో సిబ్బంది, సెక్యూరిటీ పదేపదే హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా, ఏకంగా వారి ముఖంపైనే పొగ ఊదుతూ దురుసుగా ప్రవర్తించాడు. నిబంధనలన్నా, తోటి మనుషులన్నా కనీస గౌరవం లేకుండా అతను వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రయాణికుడిగా ఉండాల్సింది పోయి భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటన వైరల్ కావడంతో అతని వ్యవహార శైలిపైనే కాకుండా ఎయిర్ పోర్ట్ భద్రతపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎయిర్ పోర్ట్ లోపలికి అది కూడా టార్మాక్ వరకు అగ్గిపెట్టె లేదా లైటర్ వంటి నిషేధిత వస్తువులు ఎలా వెళ్లాయి? తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? కోట్లాది రూపాయల ఖర్చుతో నడిచే భద్రతా వ్యవస్థలో ఇన్ని లోపాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో, అధికారులు ఉత్కర్ష్ గౌతమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. అతనిని నో ఫ్లై లిస్ట్ లో చేర్చి చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
🚨 Shocking: Airport Smoking Incident
A viral video shows a passenger, reportedly a Google employee, first caught smoking on the runway.
When taken to airport staff, he lit another cigarette, blew smoke in an airline staff member’s face, and abused them rudely.
Cigarettes… pic.twitter.com/94CFiAENtA
— Ramesh Tiwari (@rameshofficial0) March 30, 2026