
టాలీవుడ్ నటి హేమకు డ్రగ్స్ కేసులో బెంగళూరు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హేమ లేటెస్ట్గా స్పందిస్తూ ఎమోషనల్ అయింది. సోమవారం మార్చి 30న నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో పాల్గొన్న హేమ, తనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని వెల్లడించారు.
ఆ సమయంలో పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో చెబుతూ, తాను పూర్తిగా కుంగిపోయి జీవితం పట్ల నిరాశకు లోనయ్యానని పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే చివరకు నిర్దోషిగా బయటపడ్డానని స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసు సమయంలో కొన్ని మీడియా సంస్థలు నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీశాయని హేమ ఆరోపించారు. ఆ వార్తల ప్రభావం తన వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబంపై కూడా తీవ్రంగా పడిందని, తమ కుటుంబం ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కొందని చెప్పారు.
అయితే మొత్తం మీడియాను ఒకే విధంగా చూడలేమని, నిజాయితీగా వ్యవహరించే మీడియా సంస్థలు తనకు మద్దతుగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మీడియా తనకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ : సీరియల్ షూటింగ్‌లో ప్రమాదం..
గతేడాది నవంబర్ కూడా హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. డ్రగ్స్ కేసులో క్లిన్ చీట్ వచ్చిందని జడ్జిమెంట్ రావడంతో హేమ ఎమోషనల్ అయింది. “సోషల్ మీడియాలో తనపై తెగ దుష్ప్రచారం చేశారని.. ఆ బాధతో తన అమ్మ చనిపోయిందని, సోషల్ మీడియాలో తనపై జరిగిన దుర్మార్గపు ప్రచారానికి ఏడాదిన్నరగా తాను నరకయాతన అనుభవిస్తున్నానని” హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాదని చెప్పినా కుడా కొందరు అసత్య ప్రచారాలు చేశారని.. ఎట్టకేలకు తాను నిర్దోషినని కోర్టు తీర్పు ఇచ్చిందని హేమ గతేడాది చెప్పుకొచ్చింది.
బెంగళూర్ రేవ్ పార్టీ కేసు:
2024 మే 19న రాత్రి బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో లిక్కర్, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు.
ఈ కేసులో 9 మంది నిర్వాహకులు సహా 88 మందిపై అభియోగాలు మోపారు.హేమ సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు స్థానిక కోర్టులో 1086 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నటి హేమ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందని ఆరోపణలు చేస్తూ పోలీసులు ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్ 27 (బి) క్రింద కేసు నమోదు చేశారు. కానీ నటి హేమ మాత్రం తాను ఎలాంటి మత్తు మందు పదార్థాలు తీసుకోలేదని పలుమార్లు మీడియా ముందుకు వచ్చి మొరపెట్టుకుంది. అలాగే పోలీసుల విచారణలో కూడా తెలిపింది.
అయితే జనవరి 2,2025న హేమ కేసుని బెంగళూరు కోర్టు పరిశీలించింది. ఇందులో నటి హేమ తరుపు న్యాయవాది తన క్లైంట్ రేవ్ పార్టీలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కోర్టుకు తెలిపాడు. అలాగే ఇప్పటివరకూ డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలలో కూడా నెగిటివ్ వచ్చిందని కాబట్టి ఆమెపై నమోదు చేసిన కేసు, ఛార్జ్ షీట్ కొట్టివేయాలని వాదించాడు. దీంతో కోర్టు నటి హేమకి అనుకూలంగా తీర్పు ఇస్తూ క్లీన్ చిట్ ఇచ్చేసింది.