Reading Time: 2 minutes

మా ఆయన ఫోన్ కొట్టేశారు.. RCB vs SRH మ్యాచ్ రోజు స్టేడియంలో దొంగలు పడ్డారు !

Caption of Image.

RCB vs SRH మధ్య మ్యాచ్ జరిగిన బెంగళూరు చిన స్వామి స్టేడియంలో ఫోన్లు కొట్టేశారు. మ్యా్చ్ చూడటానికి వచ్చిన అభిమానుల ఫోన్లు మూడో కంటికి తెలియకుండా చోరీకి గురయ్యాయి. తన భర్త ఫోన్ కూడా చోరీకి గురయిందని ఒక వివాహిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. 

తాము నిల్చున్న స్టాండ్‌లో కూడా కొందరి ఫోన్లను దొంగిలించారని ఆమె ఆరోపించింది. బ్రేక్ టైంలో రిఫ్రెష్‌ అవడానికి తన భర్త పక్కకు వెళ్లాడని.. ఆ సమయంలో అతని ఫోన్ కూడా కొట్టేశారని ఆమె చెప్పింది. తాము మాత్రమే కాదని.. తమ చుట్టుపక్కల ఉన్న చాలా మంది ఫోన్లు కూడా పోయాయని ఆమె చెప్పుకొచ్చింది.

ఈ విషయంలో స్టేడియం లోపల ఉన్న పోలీసు సిబ్బందిని సంప్రదించినప్పటికీ, తమకు ఎలాంటి సహాయం అందలేదని ఆమె ఆరోపించింది. ఈ దొంగతనాలు పక్కా ప్లాన్ చేసి ఒక బ్యాచ్ ఫోన్లను కొట్టేసి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. RCB జెర్సీలు ధరించిన కొంతమంది మైనర్లు ఫోన్లు దొంగిలిస్తూ పట్టుబడ్డారని, వాళ్ల దగ్గర కాంప్లిమెంటరీ మ్యాచ్ టిక్కెట్లు కూడా ఉన్నాయని ఆమె ఆరోపించింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో తాను ఎఫ్‌ఐఆర్ నమోదు చేశానని , ముఖ్యంగా మ్యాచ్ బ్రేక్ టైంలో రష్ ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించింది.

ALSO READ : ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్: యూపీఐ నుంచి రైలు టిక్కెట్ల వరకూ వస్తున్న మార్పులు ఇవే..

సదరు మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోపై పెద్ద చర్చ జరిగింది. మ్యాచ్ అయిపోయాక వెళుతుంటే మెట్రో స్టేషన్ దగ్గరలో తన జేబుదొంగతనం జరగబోయిందని ఒకరు గుర్తు చేసుకున్నారు. జనాల్లో కలిసిపోయి మనం వెనక్కి తిరిగి చూసేలోపే మన వస్తువు కొట్టేస్తారని.. అప్రమత్తంగా ఉండాలని ఈ చేదు అనుభవాలను చవి చూసిన అభిమానులు సూచిస్తున్నారు. జిప్పర్ ఉన్న జాకెట్లు ధరించడం, తక్కువ విలువైన వస్తువులను తీసుకెళ్లడం.. ఇలా చేయడం వల్ల మన వస్తువులు పోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని కొందరు నెటిజన్లు వివరించారు.

©️ VIL Media Pvt Ltd.