Reading Time: < 1 minute
India Bans Chinese Cctv Cameras National Security April 2026

చైనీస్ సీసీటీవీ కెమెరాలపై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్ట్యా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘మేడ్ ఇన్ చైనా’ కెమెరాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో హెక్ విషన్ (Hikvision), దాహువా (Dahua), టీపీ-లింక్ (TP-Link) వంటి చైనా కంపెనీల హవా నడుస్తోంది. అయితే.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ఈ చైనా కంపెనీల నిఘా పరికరాల అమ్మకాలను భారత్‌లో నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ‘స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్’ (STQC) అనుమతి ఉన్న కెమెరాలను మాత్రమే ఇకపై దేశంలో విక్రయించాల్సి ఉంటుంది.

ఎందుకు ఈ నిషేధం..?

నిఘా పరికరాలు అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు, రవాణా కేంద్రాలు వంటి కీలక ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ క్రమంలో చైనా కెమెరాల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ కెమెరాల్లో రహస్యంగా ‘బ్యాక్ డోర్’ యాక్సెస్ ఉండే అవకాశం ఉందని, దీని ద్వారా సేకరించిన సమాచారం విదేశీ సర్వర్‌లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్షణ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చైనా కెమెరాలను వాడటం వల్ల మన వ్యూహాత్మక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సర్వైలెన్స్ మార్కెట్‌లలో ఒకటి. తాజా నిర్ణయం వల్ల చైనా కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండగా.. భారతీయ తయారీదారులకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరగనుంది. మొత్తానికి.. డేటా భద్రతే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ , రక్షణ రంగాల్లో పెను మార్పులకు దారితీయనుంది.