
గిగ్ వర్కర్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. గిగ్ వర్కర్ల బిల్లును కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ లో ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా మార్చి 30న మాట్లాడిన మంత్రి వివేక్.. గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ వేస్తామని అన్నారు. గిగ్ వర్కర్లతో స్వయంగా మాట్లాడి డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేశామని అన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్ల డ్రాఫ్ట్ బిల్లుపై కంపెనీలతో 5 సార్లు మీటింగులు పెట్టామని…చట్టం తీసుకొస్తే కంపెనీలకు ఎలాంటి నష్టం ఉండదని వివరించామన్నారు. గిగ్ వర్కర్లకు ప్రభుత్వం అండగా స్పష్టం చేశారు మంత్రి వివేక్.
గిగ్ వర్కర్లను పట్టించుకోకపోతే అగ్రిగేటర్లకు పెనాల్టీ వేస్తామన్నారు వివేక్. మొదటిసారి తప్పు చేస్తే రూ. 50 వేలు, రెండోసారి రూ. లక్ష, మూడోసారి తప్పు చేస్తే రూ. లక్షా 50 వేలు పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేశారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..
* గిగ్ కార్మికుల రిజిస్ట్రేషన్, పర్యవేక్షణకు ‘సామాజిక భద్రత , సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, దివ్యాంగులకు ప్రాతినిధ్యం ఉంటుంది.
* ప్లాట్‌ఫాం ఆధారిత కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యూఐడీ) కేటాయిస్తారు. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా వారికి అందుతాయి.
* అగ్రిగేటర్లు (సంస్థలు) జరిపే లావాదేవీల నుంచి 1శాతం నుంచి 2 వరకు నిధులను సేకరించి, వాటిని సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఈ నిధిని కార్మికుల బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ , పెన్షన్, ప్రసూతి ప్రయోజనాలకు ఉపయోగిస్తారు.
* యాజమాన్యాలకు, కార్మికులకు మధ్య వచ్చే తగాదాలను పరిష్కరించేందుకు బలోపేతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇబ్బందుల నివారణకు ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు పనిచేస్తాయి. కార్మికులను పనిలో నుంచి తొలగించినా లేదా పేమెంట్లు ఆపేసినా.. తక్షణమే ఫిర్యాదు చేసేందుకు ‘ప్లాట్‌ఫాం స్థాయి కమిటీలు’ జిల్లా స్థాయి అధికారులతో కూడిన యంత్రాంగం ఉంటుంది.
* ఇంతకాలం యాప్ కంపెనీలు ఏ ప్రాతిపదికన ఆర్డర్లు ఇస్తున్నాయి, పేమెంట్లు ఎలా లెక్కిస్తున్నాయి అనే దానిపై స్పష్టత ఉండేది కాదు. ఇకపై యాప్ కంపెనీలు ఇష్టమొచ్చినట్లు రేట్లు తగ్గించడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం కుదరదు. కార్మికులకు ఇచ్చే పేమెంట్లలో పారదర్శకత ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తారు.