Reading Time: 2 minutes
Up Police No Direct Fir 31 Crimes Allahabad High Court Order

UP Police: ఉత్తర ప్రదేశ్‌లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ (DGP) రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

READ ALSO: Ishaq Dar: యుద్ధం ఆపడానికి వెళ్లి భుజం విరగ్గొట్టుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని.. ఫొటోలకు ఫోజులిస్తూ..

డీజీపీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈ అంశాలలో నేరుగా పోలీస్ రిపోర్టులు దాఖలు చేయడానికి వీలు లేదు. వరకట్నం వేధింపులు, గృహ హింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, భ్రూణహత్యలు, బాల కార్మిక వ్యవస్థ, చెక్ బౌన్స్ (NI Act), విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలు, గాలి, నీటి కాలుష్యం, జంతు హింస, ఆహార కల్తీ, వినియోగదారుల మోసం (దీని కోసం FSSAI లేదా వినియోగదారుల ఫోరమ్‌ను సంప్రదించాలి), ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, మానవ అవయవాల అక్రమ రవాణా, కేబుల్ టీవీ నెట్‌వర్క్ వివాదాలపై ఇకపై యూపీ పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు.

కోర్టు జోక్యం ఎందుకంటే..
చట్టం ప్రకారం ఏ కేసులనైతే కేవలం కోర్టులోనే దాఖలు చేయాలో, వాటిని నేరుగా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా FIRలు నమోదు చేయడం వల్ల కోర్టులో నిందితులకు సాంకేతిక కారణాలతో ప్రయోజనం కలుగుతోందని ధర్మాసనం చెప్పుకొచ్చింది. విచారణలో ఆటంకాలు కలగకుండా, బాధితులకు సరైన న్యాయం అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం అని వెల్లడించింది. మేజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదు చేసినప్పుడు, ప్రాథమిక విచారణ తర్వాతే కేసు ముందుకు సాగుతుందని, దీనివల్ల తప్పుడు ఫిర్యాదులు తగ్గుతాయని చెప్పింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), దర్యాప్తు అధికారులు చట్టంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని డీజీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

READ ALSO: Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..