Reading Time: 2 minutes

ఏనాడూ కనీవినీ ఎరుగని విధంగా ఈసారి పశ్చిమబెంగాల్ ఎన్నికల ఘట్టంపై దేశమంతా ఉత్కంఠతో చూస్తోంది. దీనికి కారణం దాదాపు 27 లక్షల మంది ఓటర్లు జాబితాలో లేకుండానే ఎన్నికలు జరగనుండడం. వీరందరి అభ్యంతరాలు ఇంకా న్యాయపరిశీలనలోనే ఉన్నాయి. పోలింగ్ నాటికి వీరి పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం. ఇంతవరకు ఎటూ తేలక వీరంతా త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నారు. ఫలితంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) జరగక ముందున్న అసలు 7.66 కోట్ల ఓటర్ల జాబితా ఇప్పుడు 12% వరకు కుదించుకుపోయింది. వివాదాలమయంగా తయారైన ఈ సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య ఆదర్శాలనే సవాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలో తప్పుల తడకలు, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోవడం, తదితర సమస్యలు ప్రజాస్వామ్య మూలాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. చివరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ అనుమానాస్పదంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగానికి ధర్మరక్షకులుగా ఉన్న రాష్ట్రపతి, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడవలసిన బాధ్యత కలిగిన సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటేగానీ ఈ ఎన్నికల ప్రక్రియ పవిత్రత సిద్ధించదు.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 326 చెబుతున్న ప్రకారం వయోజన ఓటు హక్కు ఆధారంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటాయి. భారత పౌరులు ఎవరైనా 18ఏళ్లు నిండితే ఓటు హక్కు పొందే బాధ్యత తప్పనిసరి. ఈ మేరకు నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఇక 324(1) ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడం, ఓటర్ల జాబితాలను తయారు చేయడం, సవరించడం, ఎన్నికలను పర్యవేక్షించడం, మార్గదర్శకాలు జారీ చేయడం ఇవన్నీ ఎన్నికల కమిషన్ నిర్వర్తించాల్సిన విధులు. కానీ పౌరులు తమ పొరపాటు లేకుండానే ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి పశ్చిమబెంగాల్‌లో ఇప్పుడు ఏర్పడింది. పౌరుల సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే భావనపై ఎన్నికల సంఘం వైఖరి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. పశ్చిమబెంగాల్‌లో దాదాపు 92 లక్షల మంది పేర్లను ‘తార్కిక అసమానతలు’ పేరున తొలగించడం, ఈ పేర్ల తొలగింపుపై 60 లక్షల మంది అభ్యంతరాలు లేవదీయడం, ప్రజాస్వామ్య సూత్రాలనే ప్రశ్నిస్తోంది.

ఈచర్య పౌరులు తమ ఓటు హక్కును, ఎన్నికల్లో నిలబడే హక్కును, వారి తప్పిదం లేకుండానే తొలగించిందనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల కమిషన్ చేపట్టడం, దానికి పెట్టిన గడువులు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ ఓ వైపు సిద్ధమవుతూ మరోవైపు 92 లక్షల మందిని ఓటర్ల జాబితాల్లోంచి తొలగించడం, ఓటర్ల నమూనా జాబితాను ఫిబ్రవరి 28న ప్రకటించడం ఇవన్నీ ఒక పద్ధతి లేకుండా ఎందుకింత హడావుడిగా చేశారో తెలియడం లేదు. తార్కిక వైరుధ్యం లేదా తార్కిక వ్యత్యాసం పేరున జాబితానుంచి పేర్లు తొలగించడంపై దాదాపు 60లక్షల మంది తమ అభ్యంతరాలను లేవదీశారు. వీరంతా సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పేర్లు తొలగింపుపై ఎన్నికల కమిషన్ చేసిన వాదనలు సుప్రీం కోర్టును ఏమాత్రం ప్రభావితం చేయలేదు. భారత దేశ వాస్తవ పరిస్థితులకు, ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని సుప్రీం కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది.

అయినప్పటికీ ఎన్నికల కమిషన్ తన సవరణ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. అయితే తొలగించబడిన లక్షలాది మంది ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చుకునే ప్రక్రియకు సుప్రీం కోర్టు బాధ్యత వహించడం హర్షణీయమే. వాస్తవానికి ఆ పని ఎన్నికల కమిషన్ చేయాల్సింది. అభ్యంతరాలను పరిష్కరించి జాబితాలను కట్టుదిట్టం చేయడానికి సుప్రీం కోర్టు ఏప్రిల్ 7 వరకు ఎన్నికల కమిషన్‌కు గడువు ఇచ్చింది. గడువు లోగా పరిష్కరించడానికి వీలుగా 700 మందికి పైగా న్యాయమూర్తులను నియమించేలా సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌కు సహకరించింది. కానీ తార్కిక వ్యత్యాసం జాబితాలో ఉన్న 27 లక్షల మంది ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లే హక్కున్నప్పటికీ, అది లేకుండా పోయింది. ఓటరు జాబితాలో తమ స్థానాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు.

ఫిర్యాదులతో అప్పిలేట్ ముందు ఎవరైతే వేచి ఉన్నారో వారి వివాదాలు ఎటూ తేలకుండానే ఎన్నికల కమిషన్ తనపని తాను చేసుకునిపోతోంది. వీరి ఫిర్యాదులను గాలికి విడిచిపెట్టి ఎన్నికలను కమిషన్ నిర్వహించడానికి సిద్ధమైతే ఇది అత్యంత నీచమైన నాటకం అవుతుంది. పౌరులను ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారో దానికి తగిన సాక్షాధారాలు ఎన్నికల కమిషన్ నిరూపించగలగాలి. అలా కాకుండా ‘మిమ్మల్ని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు కొనసాగించాలి?’ అని పౌరులను ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే అంతకన్నా విడ్డూరం మరొకటి ఉండదు. అది సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. ఒక పౌరుడ్ని ఓటరుగా నిరూపించుకోమనడం న్యాయబద్ధమైన ప్రక్రియను పాటించకపోవడమే అవుతుంది. పౌరుడి రాజ్యాంగపరమైన ఓటు హక్కుకు భంగం కలిగించేలా ఎన్నికల సంఘం బాధ్యతలను విస్మరించే పరిస్థితి ఎదురైనప్పుడు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం తప్పనిసరి. పౌరుల హక్కులను కాపాడేందుకు, రాజ్యాంగపరమైన ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది.