
థ్రిల్లర్ అంటే ఇదీ! భారతీయులు 7వ తేదీ మంగళవారం రాత్రి నిద్రపోయే సమయానికి, ఇక తెల్లవారి నిద్రలేచే వేళకు ఈ భూగోళంపై ఇరాన్ అనే దేశం ఉండబోదనుకున్నారు. తీరా నిద్ర లేచే సరికి, అదేమీ లేదని, తన ప్రళయ భీకరమైన దాడులను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నానని అమెరికా అధ్యక్ష మహాత్ముడు ప్రకటించారు. అమ్మయ్య అని నిట్టూర్చి కాలకృత్యాలు తీర్చుకుని ఉపాహారాల కోసం కూర్చున్న వారికి, ఇరాన్ షరతులు నాన్సెన్స్ అనే మాట వైట్‌హౌస్ నుంచి వినిపించింది. లంచ్ వేళకు ఏమయేదీ ఎవరికీ తెలియదు. బహుశా ట్రంప్‌కు కూడా. అంతేకాదు కాల్పుల విరమణను అదే రోజు ఇజ్రాయెల్ ఉల్లంఘించటంతో 11వ తేదీన పాకిస్థాన్‌లో చర్చలు అనుమానాస్పదమైపోయాయి. ఈ మాట అనటం ఎందుకంటే, దాడుల విరమణకు మధ్యవర్తిత్వం తీసుకున్న పాకిస్థాన్, ఈజిప్టు, తుర్కియేలు అందుకు సంబంధించి ఎవరి షరతులేమిటో వాషింగ్టన్, టెహరాన్‌ల మధ్య పత్రాలు, మాటలను కొన్ని రోజులుగా బట్వాడా చేస్తున్నాయి.
బట్వాడా చేయటం తప్ప వారు తమ ప్రతిపాదనలేవీ ముందుంచటం లేదు. ఆ విధంగా అమెరికా, ఇరాన్‌ల పరోక్ష మంతనాలు ముందుకు సాగుతూ, వెనుకబడుతూ వస్తున్నాయి. పైకి మాత్రం ఇద్దరూ అవునని, కాదని అంటూ వచ్చారు. ఒకరి కొకరు చేసుకుంటూ వచ్చిన హెచ్చరికలు ఎదుటి పక్షంపై ఒత్తిడిని పెంచేందుకు, తమ షరతులకు అనుకూలంగా లొంగదీసేందుకన్నది ఒక అభిప్రాయం. అదే సమయం లో, చివరన ట్రంప్ ఇరాన్ నాగరికతనే రాత్రికి రాత్రి తుడిచిపెట్టగలమని, ఆ దేశం ఇక కోలుకోలేదనే స్థాయికి వెళ్లటం నిజంగానే తీవ్రమైన ఆందోళనలను కలిగించింది. అంతవరకు వాడని ఆయుధాలను ఇక వాడగలమన్న ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మాటలతో అణ్వస్త్ర ప్రయోగమా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అందుకు తగిన కారణాలున్నాయి. ట్రంప్ ఒక పిచ్చివాడివలే ఎపుడేమైనా చేయగలడనే అభిప్రాయం ఇప్పటికీ అంతటా ఏర్పడింది. అటువంటి పనులు ఈ 14 మాసాలలో అనేకం కనిపించాయి. ఇరాన్ విషయమై నిష్కారణంగా దాడులు మొదలు పెట్టటమేగాక నానాటికీ రెచ్చిపోతున్నారు. వెనిజులా వలె రెండు రోజుల్లో తేలిపోతుందనుకున్నది ఇరాన్ ప్రతిఘటనతో అయిదు వారాలు గడిచినా కొనసాగుతుండటం ట్రంప్ వంటి అహంభావికి భరించలేనిదిగా మారింది. మరొక వైపు ఇజ్రాయెల్ అజెండా ఉండనే ఉంది. దాని ప్రకారం ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలి. ఇక అణ్వస్త్ర ప్రయోగం అమెరికా లోగడ ఒకసారి చేయటమే గాక, కొరియా యుద్ధంలో, వియత్నాంలో అఫ్ఘానిస్థాన్‌లోనూ చేసేందుకు సన్నాహాలు జరిపారు.
ప్రస్తుతం ఇరాన్ ప్రశ్న పశ్చిమాసియా, బహుళ ధ్రువ ప్రపంచ నిరారణ, పెట్రోడాలర్ ఆధిపత్యం, అక్కడి చమురును స్వాధీనం చేసుకోవటం, ఆ ప్రాంతమంతటా ఇజ్రాయెల్‌కు ఎదురు లేకుండా చేయటం, తమ ప్రత్యర్ధులైన రష్యా, చైనాలకు అక్కడ ఒక మిత్ర దేశం లేకుండా చూడటం, క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం వంటి అనేక అంశాలతో ముడిబడి ఉన్నది. ఇవన్నీ మామూలు విషయాలు కావు. అందువల్ల, ఇరాన్‌ను రాత్రికి రాత్రి ఒక నాగరికతగానే తుడిచి పెట్టగలమన్న మాటలు, ముఖ్యంగా ట్రంప్ వంటి పిచ్చివాడి నోటి నుంచి వచ్చినపుడు ఉపేక్షించగలవి కావు. తీరా ఇపుడు 7వ తేదీ రాత్రి నుంచి 8వ తేదీ రాత్రికి మధ్య నాలుగు విధాలైన పరిణామాలు కనిపించాయి. ఈ వ్యాసం వెలువడే వేళకు మరేమి జరిగేదీ, పైన అనుకున్నట్లు, ట్రంప్ సైతం చెప్పజాలరు. ఇరాన్‌తో పాటు ప్రపంచం దేనికైనా సిద్ధపడి ఉండాలి.
దానినట్లుంచి మొదట ప్రస్తావించుకున్న విషయానికి వస్తే, ఎవరి షరతులు ఏమిటో ఉభయ పక్షాలకు ఎప్పటికపుడు తెలుస్తున్నపుడు 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత 15 రోజుల దాడుల విరమణ ప్రకటించిన అమెరికా అధ్యక్షునికి ఇరాన్ షరతులు ఏమిటో తెలిసే ఉండాలి కదా? ఆ విషయమై ఇజ్రాయెల్‌ను కూడా సంప్రదించే ఉంటారు కదా? అటువంటపుడు అన్నీ తెలిసి కూడా దాడుల విరమణ ప్రకటించినపుడు, తర్వాత కొద్ది గంటలకే నాన్సెన్స్ అనటానికి అర్థమేమిటి? ఇజ్రాయెల్ ఉల్లంఘనలు ఎందువల్ల? ఇంతకుముందు కూడా అమెరికా 10 షరతులు, ఇరాన్ 5 షరతులు, చివరకు అదేమీ ముందుకు సాగకపోవటం తెలిసిందే. అప్పటి దౌత్యం కూడా పాకిస్థాన్ ఈజిప్టు, తుర్కియేల ద్వారానే జరిగింది. ఆ ప్రయత్నాలు విఫలం కావటానికి కారణం రెండు పక్షాల షరతులు కూడా అసాధ్యం ఉండటం. వాటిని చూసిన వారికి ఇక చర్చలతో నిమిత్తం లేకుండానే అది ముందుకు నడిచే వ్యవహారం కాదని అర్థమైపోయింది. అయినా 48 గంటల గడువు, 5 రోజుల గడువు, 10 రోజుల గడువు అంటూ ఎవరికీ నమ్మకం కలగని నాటకాలు సాగాయి.
అయితే గమనించదగ్గది ఒకటి ఈసారి కనిపిస్తున్నది. అది 15 రోజుల యుద్ధ విరమణ ప్రకటన. ఇది తగినంత కాలం అన్నది ఒకటైతే, ఇటువంటిది ఈ నెలన్నర యుద్ధంలో జరగలేదనేది మరొకటి. షరతులను గమనిస్తే మాత్రం అవి పోయిన మారుకన్న అసాధ్యంగా కనిపిస్తున్నాయి. అమెరికా అనటం ఇరాన్ తన అణుశుద్ధిని పూర్తిగా ఆపివేసి, ఇప్పటికే శుద్ధి అయిన యురేనియంను అప్పగించి శుద్ధ కేంద్రాలను నిర్మూలించటం. ఇరాన్ అనటం యురేనియం శుద్ధికిగల తన హక్కును గుర్తించటం. అదే విధంగా హర్మూజ్ పూర్తిగా స్వేచ్ఛాయాన మార్గం కావాలన్నది అమెరికా షరతు కాగా, ఆ మార్గంపై సార్వభౌమాధికారం తమది అయి, అటు నుంచి ప్రయాణించే నౌకలపై సుంకం విధించే అధికారం ఉండాలన్నది ఇరాన్ షరతు. దానితోపాటు, ఆ ప్రాంతమంతటి నుంచి అమెరికన్ సేనలు నిష్క్రమించాలని, ఆంక్షలన్నీ ఎత్తివేయాలని, ఇంతకాలం జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని, తమ భద్రతకు పూర్తి భరోసా ఉండాలని, లెబనాన్‌పై కూడా దాడులు ఆపాలని, ఇదంతా కాల్పుల విరమణ రూపంలో తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా సమస్య పరిష్కారంగా జరగాలని ఇరాన్ కోరుతున్నది. కాల్పుల విరమణ ఎప్పుడూ ఇష్టం లేని ఇజ్రాయెల్ గతంలోనూ చర్చల ప్రక్రియను భంగపరిచినట్లు, ఈసారి కూడా వెంటనే లెబనాన్, ఇరాన్‌లపై దాడులు మొదలుపెట్టింది.
ఇరాన్ పరిస్థితి, ఉద్దేశాలు, షరతులు అన్నీ మొదటి నుంచి స్పష్టంగానే ఉన్నాయి. అందులో దాపరికాలు లేవు. వారికి కావలసింది తమ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమతను, అంతర్జాతీయ చట్టాల ప్రకారం లభించే హక్కులను కాపాడుకోవటం మాత్రమే. అంతేతప్ప పొరుగుదేశాలపై, వారి వనరులపై ఆధిపత్యం కాదు. తమ వనరులు తాము ఉపయోగించుకున తమ పద్ధతిలో అభివృద్ధి చెందటం. బయటిశక్తులు కొన్ని దశాబ్దాలుగా అందుకు భంగకారంగా వ్యవహరిస్తున్నాయి. మొదటి బ్రిటన్, తర్వాత బ్రిటన్‌తోపాటు అమెరికా, ఇపుడు అమెరికాతో కలిసి ఇజ్రాయెల్. తమ ఆధిపత్యం కోసం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని 1953లో కూలదోసిన తర్వాత, వరుసగా లెక్కలేనన్ని ఆంక్షలతో అక్కడి ఆర్థిక పరిస్థితిని, సమాజాన్ని వీలైనంత కకావికలం చేసి, ఇపుడు మళ్లీ పాలనా వ్యవస్థ మార్పు (రెజీఛేంజ్) అంటూ బయలు దేరారు. లేని అణ్వస్త్ర ఉత్పత్తిని (లోగడ ఇరాక్‌లో సామూహిక మారణాయుధాల సాకు పద్ధతిలో, సాకుగా ప్రచారం చేస్తూ ఈ దురాగతాన్నంతా సాగిస్తున్నారు. ఇదంతా ఇప్పటికే ప్రపంచానికి అర్థమైపోయింది.
అమెరికన్ ప్రజలకు కూడా. అందుకే ఈ దాడులలో అమెరికాకు సహకరించేందుకు యూరప్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వంటివి సైతం నిరాకరించటం తెలిసిందే. అంతర్గతంగా ట్రంప్ ప్రజాదరణ దారుణంగా పడిపోతున్నది. యుద్ధ ప్రభావాలు ప్రపంచ ఆర్థికంపై చూపుతున్న ప్రభావాలు తెలిసినవే. ఇపుడు అర్థం కావలసింది ఒకటున్నది. ఇరాన్ షరతులు అవేనని, గతం కన్న మరికొంత పెరిగాయని తెలుస్తుండగా, అమెరికా అధ్యక్షుడు యుద్ధ విరమణకు ఎందువల్ల అంగీకరించినట్లు? అది కూడా అసాధారణమని తోచే రీతిలో 15 రోజులకు? తన ఆలోచనలలో నిజాయితీతో కూడిన ఉద్దేశాలున్నట్లు నమ్మలేము. ఇజ్రాయెల్ ప్రధానికి అంతకన్న ఉండదు.
ఇపుడు అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్‌లో ప్రత్యక్ష చర్చలు 10వ తేదీన జరుగుతాయంటున్నారు. అందులో అయితే గియితే రాజీ లక్షణాలు కనిపించినా వాటిని భంగపరిచేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంటుందని వేరే చెప్పనక్కరలేదు. ఫిబ్రవరి 28న మొదలైన ప్రస్తుత యుద్ధానికి ముందు కూడా ఒమన్ మధ్యవర్తిత్వంతో చివరి దశకు వచ్చిన రాజీ చర్చలను భంగపరచింది. ఇజ్రాయెల్ అన్నది రహస్యం కాదు. ఇజ్రాయెల్‌ను అమెరికా గతంలోగాని, ఇపుడుగాని నియంత్రించకపోవటం కనిపిస్తూనే ఉంది. ఇరాన్‌ను ధ్వంసం చేసి, పాలస్తీనా ఏర్పాటును అడ్డుకుని, గ్రేటర్ ఇజ్రాయెల్ సృష్టికి కంకణం కట్టుకున్న నెతన్యాహూ ఈసారి మాత్రం అమెరికాఇరాన్ రాజీకి అంగీకరించగలరన్నది భ్రమ. ఇవన్నీ అమెరికా అధ్యక్షునికి పూర్తిగా తెలిసిన విషయాలే. అయినప్పటికీ ఈ విరమణ ప్రకటించటంలోని ఎత్తుగడ ఏమిటో తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
– టంకశాల అశోక్ ( దూరదృష్టి)
– రచయిత సీనియర్ సంపాదకులు