Reading Time: < 1 minute

అమరావతి: పార్క్‌లకు వస్తున్న ప్రేమ జంట వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయడంతో పాటు దాడులకు దిగడం, బెదిరించి లైంగిక కోరికలు తీర్చుకోవడం సదరు ఎఎస్‌ఐ సరదాగా మారింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మాచర్ల నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండడంతో ప్రేమ జంటలు ఏకాంతంగా గడిపేందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. స్థానిక ఎఎస్‌ఐ ప్రేమ జంటల వీడియో తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించేవాడు. అనంతరం వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ కొందరిని లైంగికంగా వేధించేవాడు. మాచర్లలో వ్యాపారితో మహిళ సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి పలుమార్లు బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఓ ఆటో డ్రైవర్ చేత సదరు ఎఎస్ఐ వీడియోలు తీయిస్తున్నాడు. అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇదే విధంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి కృష్ణారావు తెలిపారు.