
ప్రతీఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఓ ఎలక్ట్రానిక్ పరికరం టీవీ. టీవీ లేని ఇల్లు అంటూ ఏదీ ఉండదు. వినోదం కోసం ఇంట్లో టీవీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చినా ఇంట్లో టీవీ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే టీవీని కంట్రోల్ చేయడానికి రిమోట్ అనేది ఉంటుంది. రిమోట్ లేకపోతే టీవీని వాడటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. రిమోట్ ద్వారా సులువుగా ఛానల్స్ మార్చుకోవడం, సౌండ్ తగ్గించడం, పెంచడం లాంటి అన్నీ పనులు చేయవచ్చు. ఒక్కొసారి రిమోట్ ఉన్నట్లుండి మొరాయిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో చిరాకుతో రిమోట్‌ను అరచేతితో గట్టిగా కొట్టడం లాంటివి అందరూ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే రిమోట్ మళ్లీ వర్క్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు వర్క్ అవుతుంది..? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
అసలు రహస్యం ఏంటంటే?
రిమోట్ పనిచేయనప్పుడు దానిని గట్టిగా చేతితో కొట్టడం లేదా దేనికైనా వేసి కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రిమోట్ పనిచేస్తూ ఉంటుంది. దీంతో చాలామందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. చేతితో కొట్టడం వల్ల ఎందుకు పనిచేస్తుందనే అనుమానం చాలామందికి ఉంటుంది. దీనిని మీరు యాదృచ్చికం అనుకున్నప్పటికీ.. దీని వెనుక బలమైన శాస్త్రీయ కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే.. రిమోట్‌లను చాలాకాలం నుంచి ఉపయోగిస్తున్నప్పుడు.. బ్యాటరీలకు, రిమోట్ లోపల ఉండే లోహపు పాయింట్లకు మధ్య ఒక రకమైన అదృశ్య పొర ఏర్పడుతుందట. దీనిని ‘ఆక్సిడేషన్’గా పిలుస్తారు. గాలిలో ఉండే తేమ వల్ల బ్యాటరీ వద్ద స్వల్పంగా తుప్పు పట్టడం లేదా ఒక రకమైన ఆక్సైడ్ పొర ఏర్పడుతుందట. ఈ పొర బ్యాటరీ నుంచి కరెంట్‌ను రిమోట్ సర్క్యూట్‌లోకి వెళ్లకుండా చేస్తుందట. ఇలాంటి సమయంలో రిమోట్‌ను గట్టిగా కొట్టినప్పుడు ఆక్సైడ్ పొర తొలగిపోతుంది. దీనివల్ల బ్యాటరీకి, రిమోట్ పాయింట్లకు మధ్య కరెంట్ తిరిగి ప్రవహిస్తుంది. ఈ కారణం వల్ల రిమోట్ వెంటనే మళ్లీ పనిచేయడం మొదలవుతుంది.
బ్యాటరీలను రుద్దడం ఎందుకు..?
ఇక రిమోట్ పనిచేయనప్పుడు చాలామంది బ్యాటరీలను బయటకు తీసి దుస్తులపై రుద్ది మళ్ళీ సెట్ చేస్తుంటారు. ఇలాంటప్పుడు కూడా రిమోట్ మళ్లీ పనిచేస్తూ ఉంటుంది. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. సాంకేతిక బాషలో చెప్పాలంటే.. ఈ పద్దతిని ‘రీ-సీటింగ్’ అంటారు. బ్యాటరీలను తీసి శుభ్రపర్చి మళ్ళీ పెట్టడం వల్ల టెర్మినల్స్ బాగా పనిచేస్తాయి. బ్యాటరీలను రుద్దడం వల్ల వచ్చే ‘స్టాటిక్ ఎనర్జీ’ బలహీనపడిన బ్యాటరీకి శక్తిని కూడా అందిస్తుందట. దీంతో బ్యాటరీ తిరిగి మళ్లీ పనిచేయడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
అయితే రిమోట్‌ను అలా గట్టిగా కొట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రిమోట్‌ను కొట్టినప్పుడు లోపల ఉండే చిన్న చిన్న భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో చేతితో కొట్టే బదులు బ్యాటరీలను తీసి వాటి టెర్మినల్స్‌ను పొడి బట్టతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇక చలికాలంలో ఏసీ రిమోట్ వంటి తక్కువగా వాడే పరికరాల నుంచి బ్యాటరీలను తీసి విడిగా ఉంచడం మంచిది. దీనివల్ల ఆక్సిడేషన్ సమస్య ఉండదట. ఇక ఎప్పటికప్పుడు బ్యాటరీ పాయింట్లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల రిమోట్ మెరుగ్గా పనిచేస్తుంది.